మార్చి 10 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్‌లో పాల్గొనబోయే ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్, ఇండియా మహారాజాస్ జట్లు తమ కెప్టెన్ల పేర్లను నిన్న (మార్చి 1) ప్రకటించాయి. ఆసియా లయన్స్‌కు షాహిద్ అఫ్రిది, వరల్డ్ జెయింట్స్‌కు ఆరోన్ ఫించ్, ఇండియా మహారాజాస్‌కు గౌతమ్ గంభీర్‌ను కెప్టెన్లుగా ఎంపిక చేసినట్లు ఆయా జట్లు అనౌన్స్ చేశాయి.
ఈ లీగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఉతప్ప, శ్రీశాంత్, ఆరోన్ ఫించ్, షాహిద్ అఫ్రిది, మహ్మద్ హఫీజ్, తిలకరత్నే దిల్షాన్, క్రిస్ గేల్, బ్రెట్ లీ తదితర లెజెండ్స్ ఆడనున్నారు. ఆసియా లయన్స్‌కు సారధ్యం వహించనున్న షాహిద్ అఫ్రిది.. ఎల్‌ఎల్‌సీలో తొలిసారి ఆడుతుండగా.. ఇండియా మహారాజాస్ సారధి గౌతమ్ గంభీర్ 2022 ఎల్‌ఎల్‌సీ సీజన్‌లో ఇండియా క్యాపిటల్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అఫ్రిది-గంభీర్.. వారు క్రికెట్ ఆడుతున్న జమానా నుంచి ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ బద్ద శత్రువులుగా ఉన్నారు.
కాగా, ఎల్‌ఎల్‌సీ 2023 సీజన్ మ్యాచ్‌లు మార్చి 10 నుంచి 20 వరకు ఖతార్‌లోని దోహాలో ఉన్న ఏషియన్ టౌన్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఎల్‌ఎల్‌సీ 2022 సీజన్ విజేతగా ఇండియా క్యాపిటల్స్ నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో క్యాపిటల్స్.. బిల్వారా కింగ్స్‌పై 104 పరుగుల తేడాతో విజయం సాధంచి, టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఇండియా క్యాపిటల్స్ ఆటగాడు రాస్ టేలర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
41 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. టేలర్‌కు జతగా.. మిచెల్ జాన్సన్ (35 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే నర్స్ (19 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) కూడా రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరంలో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్ జట్టు.. 18.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయంపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment