లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్‌లో భాగంగా గురువారం (నవంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ సారథ్యం వహిస్తున్న ఇండియా క్యాపిటల్స్‌పై సురేశ్ రైనా నాయకత్వంలోని అర్భన్‌రైజర్స్ హైదరాబాద్ స్వల్ప తేడాతో (3 పరుగులు) విజయం సాధించింది. ఈ టోర్నీలో అర్భన్‌రైజర్స్ వరుసగా రెండో విజయం సాధించగా.. ఇండియా క్యాపిటల్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అర్భన్‌రైజర్స్.. గుర్కీరత్ సింగ్ (54 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), సురేశ్ రైనా (27 బంతుల్లో 46; 6 ఫోర్లు, సిక్స్), పీటర్ ట్రెగో (20 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అర్భన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ స్మిత్ (3), మార్టిన్ గప్తిల్ (2), స్టువర్ట్ బిన్నీ (1)నిరాశపరిచారు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో ఇసురు ఉడాన 2 వికెట్లు పడగొట్టగా.. రస్టీ థీరన్, మునాఫ్ పటేల్, కేపీ అప్పన్న తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాపిటల్స్.. గెలుపు కోసం ఆఖరి బంతి వరకు పోరాడి, స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ (48 బంతుల్లో 77; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆష్లే నర్స్ (25 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) క్యాపిటల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో రికార్డో పావెల్ (26) పర్వాలేదనిపించగా.. గౌతమ్ గంభీర్ (0), హషీమ్ ఆమ్లా (5), బెన్ డంక్ (5) విఫలమయ్యారు. అర్భన్‌రైజర్స్ బౌలర్లలో క్రిస్ మోఫు 2 వికెట్లు పడగొట్టగా.. పీటర్ ట్రెగో, టీనో బెస్ట్, పవన్ సుయల్ తలో వికెట్ దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 24) మణిపాల్ టైగర్స్, భిల్వారా కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment