Eng Vs Aus ODI: లివింగ్‌స్టోన్‌ విధ్వంసం.. 27 బంతుల్లోనే | Livingstone Brook Wreak Havoc ENG thrash AUS by 186 Runs Levels Series | Sakshi
Sakshi News home page

లివింగ్‌స్టోన్‌ విధ్వంసం.. బ్రూక్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. మట్టికరిచిన ఆసీస్‌

Published Sat, Sep 28 2024 10:22 AM | Last Updated on Sat, Sep 28 2024 11:04 AM

Livingstone Brook Wreak Havoc ENG thrash AUS by 186 Runs Levels Series

ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 186 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. కాగా మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది.

ఈ క్రమంలో పొట్టి సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మూడో మ్యాచ్‌ వర్షం వల్ల రద్దైంది. దీంతో 1-1తో టీ20 సిరీస్‌ డ్రాగా ముగిసిపోయింది. ఇక వన్డేల విషయానికొస్తే.. తొలి రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మూడో వన్డే నుంచి ఇంగ్లండ్‌ గెలుపుబాట పట్టింది.

39 ఓవర్లకు మ్యాచ్‌ కుదింపు
చెస్టెర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా డీఎల్‌ఎస్‌ పద్ధతిలో ఆసీస్‌ను 46 పరుగుల తేడాతో ఓడించింది. అదే విధంగా.. లార్డ్స్‌ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. లండన్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

బౌండరీల వర్షం కురిపించిన బ్రూక్‌
అయితే, వర్షం కారణంగా 39 ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టాపార్డర్‌లో ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ 62 బంతుల్లో 63 పరుగులు చేయగా.. హ్యారీ బ్రూక్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. 

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఫోర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 87 పరుగుల సాధించాడు. ఆడం జంపా బౌలింగ్‌లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో బ్రూక్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 

ఆసీస్‌ బౌలింగ్‌ను ఊచకోత కోసిన లివింగ్‌స్టోన్‌
ఇక వికెట్‌ కీపర్‌ జేమీ స్మిత్‌ 28 బంతుల్లో 39 రన్స్‌ చేయగా.. లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ ఆసీస్‌ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగి ఏకంగా 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ నిర్ణీత 39 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 312 పరుగులు స్కోరు చేసింది.

ఆసీస్‌ 126 పరుగులకే ఆలౌట్‌
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కనీస పోరాటపటిమ ప్రదర్శించలేకపోయింది. 24.4 ఓవర్లలో కేవలం 126 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ 34 పరుగులతో కంగారు జట్టు ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ 28 రన్స్‌ చేశాడు. 

స్టీవ్‌ స్మిత్‌(5), జోష్‌ ఇంగ్లిస్‌(8), మార్నస్‌ లబుషేన్‌(4), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(2), స్టార్క్‌(3 నాటౌట్‌) సింగిల్‌ డిజిట్లకే పరిమితం కాగా.. ఆడం జంపా, హాజిల్‌వుడ్‌ డకౌట్‌ అయ్యారు.

మాథ్యూ పాట్స్‌కు నాలుగు వికెట్లు
మిగతా వాళ్లలో అలెక్స్‌ క్యారీ 13, సీన్‌ అబాట్‌ 10 పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మాథ్యూ పాట్స్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. బ్రైడన్‌ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్‌ రెండు, ఆదిల్‌ రషీద్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. 

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలరించిన హ్యారీ బ్రూక్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక ఐదో వన్డే ఆదివారం జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌ వేదిక.

చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement