
Photo Courtesy: BCCI/PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిన ఈ జట్టు.. రాజస్తాన్ రాయల్స్‌పై 286 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఇక తదుపరి మ్యాచ్‌లో భాగంగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో రైజర్స్ తలపడనుంది.
ఈ నేపథ్యంలో సొంతమైదానం ఉప్పల్ చెలరేగి ఆడే సన్‌రైజర్స్.. 300 పరుగుల మార్కును అందుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ (James Franklin) స్పందించాడు.
300 సాధ్యమే..
‘‘ఇలా జరగదని.. నేను ఎన్నటికీ చెప్పను. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో 230, 240 స్కోర్లు దాటాయి. కాబట్టి తాజా ఎడిషన్‌లో 300 పరుగుల మార్కు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మా జట్టు ఈ స్కోరుకు దగ్గరగా వచ్చింది. కాబట్టి.. 300 స్కోరు అనే మాటను కొట్టిపారేయలేం’’ అని రైజర్స్- లక్నో మ్యాచ్‌కు ముందు ఫ్రాంక్లిన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కూడా ప్రమాదకరమైందే
అదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రస్తావన రాగా... ‘‘ఎల్‌ఎస్‌జీ బ్యాటింగ్ విభాగం ప్రమాదకరమైనది. ఆ జట్టులో టాపార్డర్ బ్యాటర్లు అద్భుతమైన ఆటగాళ్లు. వారిని ఎదుర్కోవాలంటే మూస తరహా వ్యూహాలు సరిపడవు.
మేము కాస్త సృజనాత్మకంగా ఆలోచించాల్సి ఉంటుంది. వారి బ్యాటర్లను కట్టడి చేయడానికి మా బౌలింగ్ విభాగం బాగానే కష్టపడాల్సి ఉంటుంది’’ అని జేమ్స్ ఫ్రాంక్లిన్ చెప్పుకొచ్చాడు.
కాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు టీమిండియా స్టార్ మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, సిమ్రన్‌జిత్ సింగ్‌లతో సన్‌రైజర్స్ పేస్ దళం పటిష్టంగా ఉంది. మరోవైపు లక్నో జట్టులో ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, కెప్టెన్ రిషభ్ పంత్, డేవిడ్ మిల్లర్ రూపంలో పవర్ హిట్టర్లు ఉన్నారు.
ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలుపొందగా.. లక్నో మాత్రం పరాజయాన్ని చవిచూసింది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో పరాజయం పాలైంది.
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ జట్టు
ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్‌జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, సచిన్ బేబి, జయదేవ్ ఉనాద్కట్, జీషన్ అన్సారీ, ఆడం జంపా, వియాన్ ముల్దర్, రాహుల్ చహర్, కమిందు మెండిస్, అథర్వ టైడే, ఈషన్ మలింగ
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, రిషభ్ పంత్(కెప్టెన్/వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి, మణిమరన్ సిద్ధార్థ్, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, ఆర్‌ఎస్ హంగ్రేకర్, ఆకాశ్ మహరాజ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరి, మయాంక్ యాదవ్.
చదవండి: ‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు’