World Cup, 1983 India vs West Indies, Final: ‘‘మేమప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాం. కానీ ఒక్క మ్యాచ్ వల్ల అంతా నాశనమైంది. నిజానికి 1983లో అదృష్టం ఇండియా వైపు ఉంది. ఆ సమయంలో మా జట్టు గొప్పగానే ఉన్నప్పటికీ ఎందుకో ఓటమి పాలయ్యాం.
ఫైనల్ తర్వాత బహుశా ఐదారు నెలల వ్యవధిలో మేము టీమిండియాను 6-0 తేడాతో చిత్తు చేశాం. కాబట్టి ప్రపంచకప్ ఫైనల్లో ఆ ఒక్క మ్యాచ్ టీమిండియా కేవలం అదృష్టం వల్లే గెలిచిందని చెప్పవచ్చు.
ఆనాడు మేము 183 పరుగులకు అవుట్ చేసిన తర్వాత మా బ్యాటింగ్ గొప్పగా సాగలేదు. అందుకే మ్యాచ్ ఓడిపోయాం. ఇదేదో అతి విశ్వాసమో, అతి జాగ్రత్త వల్లో జరిగింది కాదు’’ అంటూ వెస్టిండీస్ మాజీ పేసర్ ఆండీ రాబర్ట్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా కేవలం లక్ వల్లే గెలిచింది
లక్ వల్లే టీమిండియా గెలిచిందన్నట్లు వ్యాఖ్యలు చేసిన ఈ రైట్ ఆర్మ్ పేసర్.. ఆ మ్యాచ్‌లో ఒక్క బ్యాటర్, బౌలర్ కూడా తనను ఇంప్రెస్ చేయలేకపోయారన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌స్టార్‌తో రాబర్డ్స్ మాట్లాడుతూ.. ‘‘బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం ఫిఫ్టీ సాధించలేకపోయారు.
ఇక బౌలర్లు.. ఒక్కరు కూడా కనీసం 4 లేదంటే 5 వికెట్లు తీయలేకపోయారు. ఏ ఒక్కరూ ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేకపోయారు. బ్యాటర్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలి. బౌలర్లు వికెట్లు కూలుస్తూనే ఉండాలి. కానీ టీమిండియా నుంచి ఏ ఒక్కరు అలా చేయలేకపోయారు’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది
ఇక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వివియన్ రిచర్డ్స్ అవుట్ కావడం(మదన్‌లాల్ బౌలింగ్‌లో) మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత తాము ఏ దశలోనూ కోలుకోలేకపోయాం. 1975, 1979 ఫైనల్స్.. 1983 ఫైనల్‌కి తేడా ఒక్కటే.. ఆ రెండు దఫాలు మేము తొలుత బ్యాటింగ్ చేశాం. 83లో ఛేజింగ్ చేశాం’’ అని రాబర్ట్స్ వ్యాఖ్యానించాడు.
1983 వరల్డ్‌కప్ ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ 38 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ మొహిందర్ అమర్నాథ్ 26, సందీప్ పాటిల్ 27 పరుగులు చేశారు. మిగతా వాళ్లెవరూ 20 పరుగుల స్కోరును అందుకోలేకపోయారు.
రాబర్ట్స్‌కు అత్యధికంగా
ఈ క్రమంలో 54.4 ఓవర్లలో 183 పరుగులు చేసి కపిల్‌దేవ్ సేన ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో ఆండీ రాబర్ట్స్ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 140 పరుగులకే చాపచుట్టేయడంతో 43 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. కాగా వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజంగా పేరొందిన ఆండీ రాబర్ట్స్ 1975, 1979లో ప్రపంచ కప్ గెలిచిన జట్లలో సభ్యుడు.
ఇప్పుడు ఇదంతా దేనికి?
ఇదిలా ఉంటే.. ఆండీ రాబర్ట్స్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘అవును మరి.. ఒక్క మ్యాచ్‌తోనే ఫలితాలు తారుమారవుతాయి.ఘే జట్టు విషయంలోనైనా ఇలాగే జరుగుతుంది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ దేవ్ బృందం విజేతగా నిలిచి టీమిండియా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇలాంటి చెత్త మాటలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. విండీస్ కనీసం వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్‌కు అర్హత సాధించలేకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
చదవండి: టీమిండియా పేసర్ షమీకి భారీ షాక్! కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక
Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment