ముంబై: ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం... ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లూ ఆడిన జోడీ... ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు... ఈ ఘనతలన్నీ ఒక్క మ్యాచ్‌లోనే వచ్చాయి. విధ్వంసకర బ్యాటింగ్‌తో క్వింటన్ డికాక్ రికార్డులు కొల్లగొట్టగా, కేఎల్ రాహుల్ సహాయక పాత్రలో నిలిచాడు. వీరిద్దరి జోరుతో 2022 సీజన్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ సగర్వంగా ‘ప్లే ఆఫ్స్’లోకి అడుగు పెట్టింది. ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో లక్నో 2 పరుగులతో కేకేఆర్‌పై విజయం సాధించింది.
ముందుగా లక్నో 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (70 బంతుల్లో 140 నాటౌట్; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు) అజేయ సెంచరీకి రాహుల్ (51 బంతుల్లో 68; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ తోడైంది. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీశ్ రాణా (22 బంతుల్లో 42; 9 ఫోర్లు), రింకూ సింగ్ (15 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), స్యామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.
అభేద్య భాగస్వామ్యం...
డికాక్, రాహుల్ భాగస్వామ్యం సాధారణంగానే ప్రారంభమైంది. ఇద్దరూ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నా... లక్నో అసలు ఆట చివరి 5 ఓవర్లలో కనిపించింది. 15 ఓవర్లు ముగిసేసరికి టీమ్ స్కోరు 122 పరుగులు కాగా, తర్వాతి 5 ఓవర్లలో ఏకంగా 88 పరుగులు వచ్చాయి! ఇందులో చాలా వరకు రాహుల్ ప్రేక్షక పాత్రకు (16 పరుగులు) పరిమితం కాగా... డికాక్ (71 పరుగులు) రెచ్చిపోయాడు. 59 బంతుల్లోనే డికాక్ శతకం పూర్తయింది. డికాక్‌కు ఐపీఎల్‌లో ఇది రెండో సెంచరీ. ఆ తర్వాత సౌతీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ లక్నో బ్యాటింగ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో రాహుల్ ఒక సిక్స్ కొట్టగా, డికాక్ వరుసగా మూడు బంతుల్లో 6, 6, 6తో చెలరేగాడు. రసెల్ వేసిన ఆఖరి ఓవర్లో డికాక్ వరుస బంతుల్లో 4, 4, 4, 4 కొట్టడం విశేషం.
చివరి వరకు పోరాడినా...
మొహసిన్ తన వరుస ఓవర్లలో వెంకటేశ్ (0), తోమర్ (4)లను అవుట్ చేయడంతో కోల్‌కతా ఛేదన పేలవంగా మొదలైంది. చివర్లో రింకూ, నరైన్ 19 బంతుల్లోనే 58 పరుగులు జోడించి జట్టు గెలుపు అవకాశాలు పెంచారు. స్టొయినిస్ వేసిన ఆఖరి ఓవర్లో విజయం కోసం 21 పరుగులు చేయాల్సి ఉండగా రింకూ సింగ్ వరుసగా 4, 6, 6, 2తో గెలుపునకు చేరువగా తెచ్చాడు. 2 బంతుల్లో 3 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఐదో బంతికి లూయిస్ అద్భుత క్యాచ్‌తో రింకూ ఆట ముగియగా, చివరి బంతికి ఉమేశ్ బౌల్డయ్యాడు.
స్కోరు వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (నాటౌట్) 140; రాహుల్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 210.
బౌలింగ్: ఉమేశ్ 4–0–34–0, సౌతీ 4–0–57–0, నరైన్ 4–0–27–0, వరుణ్ 4–0– 38–0, రసెల్ 3–0–45–0, రాణా 1–0–9–0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) డికాక్ (బి) మొహసిన్ 0; అభిజిత్ తోమర్ (సి) రాహుల్ (బి) మొహసిన్ 4; రాణా (సి) స్టొయినిస్ (బి) గౌతమ్ 42; శ్రేయస్ (సి) హుడా (బి) స్టొయినిస్ 50; బిల్లింగ్స్ (స్టంప్డ్) డికాక్ (బి) బిష్ణోయ్ 36; రసెల్ (సి) హుడా (బి) మొహసిన్ 5; రింకూ (సి) లూయీస్ (బి) స్టొయినిస్ 40; నరైన్ (నాటౌట్) 21; ఉమేశ్ (బి) స్టొయినిస్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 208.
వికెట్ల పతనం: 1–0, 2–9, 3–65, 4–131, 5–142, 6–150, 7–208, 8–208.
బౌలింగ్: మొహసిన్ 4–0– 20–3, హోల్డర్ 4–0–45–0, అవేశ్ 4–0–60–0, గౌతమ్ 2–0–23–1, బిష్ణోయ్ 4–0–34–1, స్టొయినిస్ 2–0–23–3.
ఆ క్యాచ్ పట్టి ఉంటే...
డికాక్ వ్యక్తిగత స్కోరు 12 పరుగుల వద్ద అతను కొట్టిన షాట్ థర్డ్‌మాన్ దిశగా వెళ్లగా, తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న అభిజిత్ తోమర్ ఒత్తిడిలో బంతి గమనాన్ని సరిగా అంచనా వేయలేక క్యాచ్ వదిలేశాడు.
ఐపీఎల్‌లో నేడు
గుజరాత్ టైటాన్స్ X బెంగళూరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో.
Comments
Please login to add a commentAdd a comment