
బెంగళూరు: రంజీ ట్రోఫీలో 23 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. శనివారం ముగిసిన సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ 174 పరుగులతో బెంగాల్‌పై ఘన విజయం సాధించింది. 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు 96/4 స్కోరుతో బరిలోకి దిగిన బెంగాల్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే కుప్పకూలింది. ఐదో రోజు వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైనా... ఆ తర్వాత బెంగాల్ 28.2 ఓవర్లలోనే మరో 79 పరుగులు జోడించి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది.
అభిమన్యు ఈశ్వరన్ (157 బంతుల్లో 78; 7 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ (5/67) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. 1998–99 సీజన్‌లో ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ తుది పోరులో కర్ణాటక చేతిలో 96 పరుగుల తేడాతో ఓడింది. నాటి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కూడా సాధించి, ‘డ్రా’గా ముగిస్తే చాలనే స్థితిలో ఉన్న మధ్యప్రదేశ్ ఆఖరి రోజు చివరి సెషన్‌లో అనూహ్యంగా కుప్పకూలి ఆట ముగియడానికి ఐదు ఓవర్ల ముందు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment