కార్ల్‌సన్‌ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్‌కు అవమానం! | Magnus Carlsen Allows Opponent For Selfie After Her Phone Removed | Sakshi
Sakshi News home page

కార్ల్‌సన్‌ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్‌కు అవమానం!

Apr 5 2026 11:28 AM | Updated on Apr 5 2026 1:22 PM

Magnus Carlsen Allows Opponent For Selfie After Her Phone Removed

ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ తన తోటి ప్లేయర్‌ను అవమానించి మరోసారి వార్తల్లో నిలిచాడు. జర్మనీలోని కార్ల్స్‌రూహే వేదికగా గ్రెంకె చెస్ ఫ్రీస్టైల్ ఓపెన్ టోర్నీలో ఈ  ఘటన చోటుచేసుకుంది. టోర్నీలో భాగంగా రెండో రౌండ్‌లో కార్ల్‌సన్ కజకిస్తాన్‌కు చెందిన రెండో ర్యాంకర్ (మహిళల విభాగంలో) అలువా నూర్మన్‌తో తలపడాల్సి ఉంది. 

కార్ల్‌సన్ వచ్చి తన కుర్చీలో కూర్చోగానే అలువా ‘మీతో ఒక సెల్ఫీ దిగొచ్చా’ అని కార్ల్‌సన్‌ను అడిగింది. కార్ల్‌సన్ ఒప్పుకోవడంతో అలువా తన బ్యాగులో నుంచి ఫోన్ తీసి కార్ల్‌సన్‌తో సెల్ఫీ దిగింది. ఆ సమయంలో కార్ల్‌సన్ కూడా నవ్వుతూ ఫొటోకు ఫోజిచ్చాడు.  కాసేపటికే అపరిచితుడిలా మారిన కార్ల్‌సన్ ఉన్నట్టుండి తన సీటు నుంచి లేచి మ్యాచ్‌ల నిర్వహణ చూస్తున్న ఆర్బిటర్‌ను పిలిచి విషయం చెప్పాడు. 

దీంతో ఆర్బిటర్ అలువా నూర్మన్ వద్దకు వచ్చి ‘మీ ఫోను ఇచ్చేయండి’ అని అడిగాడు. దీంతో నూర్మన్ తన బ్యాగులో నుంచి ఫోన్ తీసి ఆర్బిటర్‌కు ఇచ్చేసింది. ఫోన్‌ను కార్ల్‌సన్‌కు చూపించిన ఆర్బిటర్ ‘ఓకే నా’ అన్నట్లుగా సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను చెస్ బేజ్ ఇండియా షేర్ చేసుకోవడంతో వైరల్‌గా మారింది. 

కానీ ఆర్బిటర్ చర్యను మాత్రం ఎవరు తప్పుబట్టడం లేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం చెస్ గేమ్‌లో ఫోన్ వాడడం లేదా ఉపయోగించడం నిషేధం. గేమ్ ఆడేటప్పుడు ఆటగాళ్లు కూడా మొబైల్‌ను తమ వద్ద పెట్టుకోకూడదు. కార్ల్‌సన్ అందుకే అలువా నూర్మన్ వద్ద ఫోన్ ఉందని, అది రూల్స్‌కు విరుద్ధం కావడంతో ఆర్బిటర్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. 

అయితే గతేడాది డిసెంబర్‌లో కార్ల్‌సన్ ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి చేతిలో ఓటమిని తట్టుకోలేక విచిత్రంగా ప్రవర్తించాడు. మ్యాచ్ ఓటమిని తట్టుకోలేని కార్ల్‌సన్.. అర్జున్ షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయగా, కార్ల్‌సన్ మాత్రం కోపంతో టేబుల్‌ను బలంగా కొడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సంచలనంగా మారింది.

చదవండి: రోహిత్ దెబ్బ‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మైండ్ బ్లాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement