ప్రేమకు సరిహద్దు లేదు అని మరోసారి నిరూపితమైంది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా లైవ్‌లో లవ్‌ప్రపోజ్ చేసిన సందర్భాలు కోకొల్లలు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యాయి. 2021 ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే ఆటగాడు దీపక్ చహర్ తన లవర్ జయా భరద్వాజ్‌కు లైవ్‌లోనే లవ్ ప్రపోజ్ చేయడం అప్పట్లో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం టీమిండియా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌లో ఒక అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే ఒక వ్యక్తి తాను ప్రేమించిన యువతి వద్దకు వచ్చి అచ్చం దీపక్ చహర్‌లా మోకాళ్లపై నిలబడి ఆమె చేతి వేలికి రింగ్ తొడిగాడు. ఆ తర్వాత ఐ లవ్ యూ.. విల్ యూ మ్యారీ మీ అని అడిగాడు. అందరిముందు అలా అడిగేసరికి మొదట సిగ్గుపడినప్పటికి యువతి అతని చెప్పిన విధానానికి ముగ్దురాలై ఓకే చెప్పేసింది. ఇదంతా పక్కనే ఉండి గమనించిన తోటి మిత్రులు సంతోషంతో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఆమె అతని లవ్‌ను ఒప్పుకుంది అంటూ క్యాప్షన్ జత చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టీమిండియా నిర్ధేశించిన 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా టీమిండియా 56 పరుగుల భారీ మార్జిన్‌తో విజయం సాధించింది. భారత బౌలర్లందరూ మూకుమ్మడిగా రాణించడంతో నెదర్లాండ్స్ భారీ తేడాతో ఓడింది.
భువీ 3 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్, అక్షర్ పటేల్, అశ్విన్‌లు కూడా తలో 2 వికెట్లు తీశారు. షమీకి ఓ వికెట్ దక్కింది. అంతకుముందు రోహిత్ (53), కోహ్లి (62 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (51 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
చదవండి: నన్ను GOAT అని పిలవకండి.. ఆ ఇద్దరే అందుకు అర్హులు: విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment