టీమిండియా వెటరన్ క్రికెటర్ మన్‌దీప్ సింగ్ కీలక ప్రకటన చేశాడు. పంజాబ్ జట్టుతో తన పద్నాలుగేళ్ల బంధం ముగిసిందని తెలిపాడు. ఇకపై తాను దేశవాళీ క్రికెట్‌లో త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు వెల్లడించాడు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.
పరుగుల వరద
పంజాబ్‌లోని జలంధర్‌లో 1991లో జన్మించిన మన్‌దీప్ సింగ్‌కు చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ. ఈ క్రమంలో బ్యాటర్‌గా ఎదిగిన అతడు.. 2010 అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే ఏడాది.. పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మన్‌దీప్ సింగ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 14 వేలకు పైగా పరుగులు సాధించాడు.
ఇందులో 19 సెంచరీలు, 81 అర్ధ శతకాలు ఉండటం విశేషం. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రమంలో 2016లో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మన్‌దీప్ సింగ్.. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
పంజాబ్‌కు టైటిల్ అందించిన కెప్టెన్
టీమిండియా తరఫున మూడు టీ20 మ్యాచ్‌లు ఆడి 87 పరుగులు చేశాడు. అదే ఏడాది చివరిసారిగా భారత్‌కు ఆడిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. పంజాబ్ కెప్టెన్‌గానూ పనిచేశాడు. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో పంజాబ్‌కు టైటిల్ అందించిన 32 ఏళ్ల మన్‌దీప్ సింగ్.. తన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లు శనివారం ప్రకటించాడు.
అందుకే జట్టును వీడుతున్నా
కాగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలని భావిస్తోందని.. అందుకే జట్టుకు తన సేవలు ఇక అవసరం లేదని మన్‌దీప్ అన్నాడు. ఈ ఏడాది త్రిపుర జట్టుతో జతకట్టేందుకు సిద్దమైనట్లు తెలిపాడు. కాగా మరో పంజాబీ బ్యాటర్ జీవన్‌జ్యోత్ సింగ్ కూడా ఈసారి త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment