Shane Warne Death Anniversary: ‘‘అత్యంత విచారకరం. అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే నిజంగా నమ్మలేకపోతున్నా’’ అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ దివంగత షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్నాడు. కాలం గిర్రున తిరిగిపోయిందని.. వార్న్ లేడన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశాడు. అద్భుతమైన బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే వార్న్ లేనిలోటు ఎవరూ పూడ్చలేరన్నాడు.
‘మాంత్రికుడు’ మరో లోకానికి..
ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఈ లోకాన్ని వీడి నేటికి సరిగ్గా ఏడాది. థాయ్‌లాండ్‌లో ఉన్న సమయంలో గుండెపోటుకు గురైన అతడు హఠాన్మరణం చెందాడు. ఛాతీ నొప్పితో కుప్పకూలిన వార్న్.. థాయ్‌లాండ్ పర్యటనలోనే కన్నుమూశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహించింది. వార్న్‌ను కడసారి చూసుకునేందుకు తరలివచ్చిన అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.
క్రికెట్ అంటే పిచ్చి
ఈ నేపథ్యంలో షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్న మార్క్ టేలర్.. వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. స్పిన్ మాంత్రికుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇండియాలో బంతి అద్భుతంగా టర్న్ అవుతున్న సందర్భాల్లో కచ్చితంగా వార్న్ మనందరికీ మరీ మరీ గుర్తుకువస్తాడు. తన స్పిన్ మాయాజాలంతో వార్న్ చేసిన అద్భుతాలు, మైదానంలో వదిలిన జ్ఞాపకాలు అలాంటివి.
అతడు లేని లోటు ఎన్నటికీ ఎవ్వరూ పూడ్చలేరు. అతడి అభిప్రాయాలన్నింటితో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ ఆట పట్ల వార్న్‌కు ఉన్న ప్రేమ, అంకితభావానికి మాత్రం ఫిదా కాకుండా ఉండలేం’’ అని మార్క్ టేలర్ చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీసి వార్న్ ‘ఆల్‌టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి టైటిల్ గెలిచిన సారథిగానూ రికార్డులకెక్కాడు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో
ఇక ప్రస్తుతం టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ వార్న్ పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొడుతూ సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు.. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: Ind Vs Aus: ఇండోర్ పిచ్ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం
నోరు మూసుకుని ఆటపై దృష్టి పెట్టండి.... టీమిండియాపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment