ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ స్వదేశీ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తీసుకున్న ఓ నిర్ణయంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. సహజంగా ఇతర దేశాల ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాన్.. ఈసారి ఓ విషయంలో స్వదేశీ బోర్డుపై దుమ్మెత్తిపోశాడు.
వివరాల్లోకి వెళితే.. టీ20 వరల్డ్‌కప్ 2024 దృష్ట్యా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా నిషేధాజ్ఞలు విధించింది. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ మెగా టోర్నీకి ముందు స్వదేశంలో పాక్‌తో జరిగే టీ20 సిరీస్‌లో తప్పక పాల్గొనాలని అల్టిమేటం జారీ చేసింది. దీంతో జోస్ బట్లర్ (రాజస్థాన్), విల్ జాక్స్ (ఆర్సీబీ), ఫిల్ సాల్ట్ (కేకేఆర్) లాంటి ఆటగాళ్లు కీలకమైన ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడకుండా స్వదేశానికి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా ఈసీబీ పెద్ద తప్పిదమే చేసిందని మండిపడ్డాడు.
మెగా టోర్నీకి ముందు పాక్ లాంటి జట్టుతో స్వదేశంలో సిరీస్ ఆడేకంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటేనే ఇంగ్లండ్‌కు మంచి జరిగి ఉండేదని అభిప్రాయపడ్డాడు. ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బట్లర్, జాక్స్, సాల్ట్‌లకు భారీ జనసమూహాల మధ్య ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలిసుండేదని అన్నాడు.
ప్రపంచకప్‌కు ముందు లభించిన ఈ అరుదైన అవకాశాన్ని ఈసీబీ చేజేతులారా జారవిడ్చుకుందని ధ్వజమెత్తాడు. స్వదేశీ ఆటగాళ్ల విషయంలో ఈసీబీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యిందో అర్దం కావట్లేదని మండిపడ్డాడు.
కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ స్వదేశంలో పాక్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 నిన్ననే ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాక్‌పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మిగిలిన రెండు మ్యాచ్‌లు 28, 30 తేదీల్లో జరుగనున్నాయి. జూన్ 1 నుంచి యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాక్, ఇంగ్లండ్ జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో పోటీపడుతున్నాయి. పాక్.. భారత్, కెనడా, యూఎస్‌ఏ, ఐర్లాండ్‌లతో పాటు గ్రూప్-ఏలో, ఇంగ్లండ్.. ఆసీస్, ఒమన్, నమీబియా, స్కాట్లాండ్‌లతో పాటు గ్రూప్-బిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment