‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత జట్టును చూడాలి’ | Minerva Academy Owner- Football Coach Ranjit Bajaj Emotional Words | Sakshi
Sakshi News home page

Ranjit Bajaj: ‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత జట్టును చూడాలి’

Apr 10 2026 11:42 AM | Updated on Apr 10 2026 12:37 PM

Minerva Academy Owner- Football Coach Ranjit Bajaj Emotional Words

రంజిత్‌ బజాజ్‌, ఎంఐసీ కప్‌లో మినర్వా ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు

క్రికెట్‌తో పోలిస్తే భార‌త్‌లో ఫుట్‌బాల్‌కు ఆద‌ర‌ణ త‌క్కువే. బైచుంగ్ భుటియా, సునీల్ ఛెత్రీ.. ఈ ఇద్ద‌రే భార‌త్ ఫుట్‌బాల్‌లో కాస్త తెలిసిన ముఖాలు. అస‌లు మ‌న‌కంటూ ఒక ఫుట్‌బాల్ టీం ఉంద‌న్న సంగ‌తి కూడా చాలా మందికి తెలియ‌దు. పాశ్చాత్య దేశాల్లో ఫుట్‌బాల్‌కు ఉండే క్రేజ్ వేరు. క్రికెట్‌లో వ‌ర‌ల్డ్‌క‌ప్ ఎలాగూ ఫుట్‌బాల్‌లో ప్ర‌తిష్ఠాత్మ‌క ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ కూడా అలాంటిదే. ఇంకా చెప్పాలంటే ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్ కంటే ఎక్కువే అని చెప్పొచ్చు. ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఒక్క‌సారైనా ఆడాల‌ని చాలా దేశాలు క‌ల‌లు కూడా కంటాయి.

ఈ నేప‌థ్యంలోనే దేశ‌వాలీలో ఫుట్‌బాల్ ఆట‌కు మ‌ళ్లీ తిరిగి పూర్వ‌వైభ‌వం తెచ్చేందుకు త‌న వంతు కృషి చేస్తున్న‌ట్లు మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ ఓన‌ర్‌, కోచ్‌ రంజిత్ బ‌జాజ్ వెల్ల‌డించారు. తాను చ‌నిపోయేలోగా భార‌త సీనియ‌ర్ జ‌ట్టును ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో చూస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయంగా భారత్‌ను ఫుట్‌బాల్‌లోనూ ఉన్నతస్థాయికి చేర్చడమే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలిపారు.

ఇటీవ‌లే అండ‌ర్‌-15 మెడిటేరియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ క‌ప్ (ఎంఐసీ)లో భార‌త్‌కు చెందిన మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టింది. ముఖ్యంగా ప్రిక్వార్ట‌ర్స్‌లో మిన‌ర్వా జ‌ట్టు 6-0 తేడాతో లివ‌ర్‌పూల్ జ‌ట్టును ఓడించి సంచ‌ల‌నం సృష్టించింది. ఎంఐసీ క‌ప్‌లో తొలిసారి ఆడుతున్న‌ప్ప‌టికీ ఏ బెరుకు లేకుండా ఆడిన మిన‌ర్వా జ‌ట్టు క్వార్టర్స్‌లో ఓడిన‌ప్ప‌టికీ టోర్నీని ఐదో స్థానంతో ముగించి బెస్ట్ ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేసింది.

అయితే మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ ఏర్పడడం వెనుక ఆ జ‌ట్టు కోచ్‌ రంజిత్ బ‌జాజ్ చాలా ఏళ్ల శ్ర‌మ దాగుంది. తాజాగా చందాలు పోగు చేసి మ‌రీ త‌న జ‌ట్టును స్పెయిన్‌లో జ‌రిగిన ఎంఐసీ క‌ప్ ఆడేందుకు పంపించ‌డం గ‌మ‌నార్హం. అయితే మార్చి 16న మిన‌ర్వా క్ల‌బ్ జ‌ట్టును పంపించ‌డానికి ముందు రంజిత్ బ‌జాజ్ ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆయ‌న ఇచ్చిన సందేశం ప్ర‌తీ ఒక్క‌రిని కంట‌త‌డి పెట్టించేలా ఉంది.  

మొత్తం జ‌ట్టును స్పెయిన్‌కు పంపేందుకు త‌న ఆస్తులను అమ్మిన‌ప్ప‌టికీ మ‌రో కోటి రూపాయ‌లు త‌క్కువ ప‌డింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా డ‌బ్బు స‌హాయం అంద‌జేయాలని త‌న ఫాలోవ‌ర్ల‌ను కోరారు. ఆయ‌న ఫాలోవ‌ర్లంతా ఈ విష‌యాన్ని షేర్ చేసి 27 ల‌క్ష‌ల రూపాయ‌లు ఆయ‌న‌కు అంద‌జేశారు. మొత్తంగా ఎలాగోలా త‌న జ‌ట్టును ఎంఐసీ క‌ప్ ఆడేందుకు పంపించారు.

మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ జ‌ట్టు 2022లో మెనా కప్‌, 2023లో బ్రెజిల్‌ను ఓడించి గోథియా కప్‌ను కైవ‌సం చేసుకుంది. కానీ స‌రైన ఫండ్స్ లేక‌పోవ‌డంతో 2024లో ఒక్క టోర్నీ కూడా ఆడ‌లేక‌పోయింది. ఇది భార‌త్‌లోని ప్ర‌తిభావంత‌మైన ఫుట్‌బాల్ ఆట‌గాళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని రంజిత్ బ‌జాజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎవ‌రీ రంజిత్ బ‌జాజ్‌?
రంజిత్ బజాజ్ (Ranjit Bajaj) భారత ఫుట్‌బాల్ రంగంలో, ముఖ్యంగా గ్రాస్‌రూట్ స్థాయిలో ప్రతిభను గుర్తించి వారిని ఆటగాళ్లుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చండీగఢ్‌లో మినర్వా అకాడమీ నెలకొల్పి యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తూ భారత ఫుట్‌బాల్ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. 

సందేశ్ జింగాన్‌, కమల్‌జిత్ సింగ్‌, జీక్సన్ సింగ్ (ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున మొదటి గోల్ చేసిన ఆటగాడు) వంటి ప్రముఖ ఆటగాళ్లంతా ఈయన అకాడమీ నుంచే వచ్చారు. భారత ఫుట్‌బాల్ అభివృద్ధి కోసం, ముఖ్యంగా యువతకు అవకాశం కల్పించడం కోసం ఆయన తన ఆస్తులను (భార్య బంగారు ఆభరణాలు) సైతం తాకట్టు పెట్టి అకాడమీని నడిపారు. 

త‌న‌కు ఎవ‌రు స‌హాయం చేసేందుకు ముందుకు రానప్పటికీ 2020 నుంచి మినర్వా అకాడమీ తరఫున 250 మందికి పైగా ఆటగాళ్లకు వంద శాతం స్కాలర్‌షిప్‌లు ఇచ్చి వాళ్లను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దారు. తాను చనిపోయేలోగా భారత సీనియర్ జట్టు ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొనేలా చూడడమే తన కల అని రంజిత్ బజాజ్ చాలాసార్లు చెప్పుకొచ్చారు.  మరి ఆయన కల నెరవేరాలని ఆశిద్దాం.

ఫుట్‌బాల్‌లోనూ స్వర్ణయుగం..
ఒకప్పుడు ఆసియాలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా పరిగణించబడిన మ‌న ఫుట్‌బాల్ టీం 1950 నుంచి 1960 మ‌ధ్య స్వర్ణయుగాన్ని చూసింది. హైద‌రాబాద్‌కు చెందిన‌ సయ్యద్ అబ్దుల్ రహీం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భారతదేశం 1951, 1962 ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలను గెలుచుకోవ‌డంతో పాటు 1956 ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. 

అయితే భారత జట్టు ఎప్పుడు ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొనలేదు.కానీ 1950 ఫిఫా వరల్డ్‌కప్‌లో మాత్రం క్వాలిఫికేషన్ గ్రూప్‌లోని ఇతర దేశాలన్నీ వైదొలగడంతో 1950 ప్రపంచ కప్‌కు డిఫాల్ట్‌గా అర్హత సాధించింది. అయితే, టోర్నమెంట్ ప్రారంభానికి ముందే భారత్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. 

భారత జట్టు ఆసియా  ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ అయిన ఏఎఫ్‌సీ ఆసియా కప్‌లో ఐదుసార్లు పాల్గొని , 1964 లో రన్నరప్‌గా నిలిచింది .దక్షిణాసియాలో పాపులర్ టోర్నీగా పిలవబడే దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ కప్‌ (శాప్-SAFF) కప్‌లో అజేయమైన టీమ్‌గా రికార్డు ఉంది. 1993లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ టోర్నమెంట్‌ను భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలుచుకుంది.

చదవండి: వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement