సెంట్ లూసియా: ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో(75 పరుగులు, 3 వికెట్లు) ఆస్రేలియా విండీస్ పర్యటనలో ఎట్టకేలకు విజయాన్ని దక్కించుకుంది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని దక్కించుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (75, 44 బంతులు; 4 ఫోర్లు, 6 సిక్సర్లతో) దుమ్మురేపగా.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 53 పరుగులతో అతనికి సహకరించాడు. ఇక చివర్లో క్రిస్టియన్ 22 పరుగులతో మెరిశాడు. విండీస్ బౌలర్లలో హెడెన్ వాల్ష్ 3 వికెట్లతో మెరవగా.. థామస్, రసెల్, అలెన్‌లు ఒక్కో వికెట్ తీశారు.
ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు సిమన్స్, ఎవిన్ లూయిస్ తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే 31 పరుగులు చేసిన లూయిస్ జంపా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక గత మ్యాచ్ హీరో క్రిస్ గేల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మిచెల్ మార్ష్ వెనక్కి పంపాడు. మరోఎండ్‌లో సిమన్స్ మాత్రం దాటిగా ఆడుతూ రన్‌రేట్ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఫ్లెచర్, నికోలస్ పూరన్‌లు స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత 72 పరుగులు చేసిన సిమన్స్ కూడా వెనుదిరిగాడు. చివర్లో రసెల్, పాబియెన్ అలెన్‌లు కొన్ని భారీ షాట్లతో మెప్పించారు.
ఆఖరి ఓవర్‌లో విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో అలెన్ ఔట్ కావడంతో విండీస్ విజయానికి గండి పడింది. రసెల్ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఆసీస్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ 3, ఆడమ్ జంపా 2, రిలే మెరిడిత్ ఒక వికెట్ తీశారు. ఇప్పటికే సిరీస్‌ను దక్కించుకున్న విండీస్ 3-1తో ఆధిక్యంలో ఉంది. ఇక చివరి టీ20 శుక్రవారం( జూలై 16న) జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment