సాక్షి క్రీడా విభాగం : భారత క్రికెట్ అంటేనే పురుషుల క్రికెట్... స్టార్లు అంటేనే సన్నీ, కపిల్, వెంగీ, సచిన్, ధోని, కోహ్లి.... భారత్‌లో మతమైన క్రికెట్‌కు మెజార్టీ ప్రజల అభిమతమిదే! ఇలాంటి దేశంలో అమ్మాయిలకూ ఓ అధ్యాయం ఉందని మిథాలీ రాజ్ వచ్చాకే తెలిసింది.
దీన్ని సువర్ణాధ్యాయంగా మలిచిన ఘనత కూడా ముమ్మాటికి ఆమె ఆటదే. 23 ఏళ్ల క్రితం ప్రభలేని మహిళా క్రికెట్‌కు కొత్త శోభ తెచ్చింది. ఆమె పరుగులు పెడుతున్నప్పుడు అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డులో మన మహిళా క్రికెట్ లేదు. (ఆలస్యంగా బీసీసీఐ గొడుగు కిందకు వచ్చింది).
ఆమె సెంచరీలు కొడుతుంటే... రూ. లక్షల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రైజ్‌మనీ రాలేదు. సిరీస్‌లను గెలిపిస్తే ఖరీదైన కారు (ప్లేయర్ ఆఫ్ ది సిరీస్) ఇవ్వలేని అమ్మాయిల క్రికెట్ గతి అది. ఇవేవీ తనకు దక్కకపోయినా... తను నమ్ముకున్న క్రికెట్‌కు 23 ఏళ్ల పాటు సేవలందించిన ధీరవనిత మిథాలీ. గత కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పు వెనుక మిథాలీ పాత్ర కూడా ఎంతో ఉంది.
23 ఏళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ శతకంతో తారలా దూసుకొచ్చింది మిథాలీ రాజ్. ఈ 23 ఏళ్లలో మహిళల క్రికెట్‌లో తరాలు మారాయి. ఫార్మాట్‌లు మారాయి. ప్లేయర్లు మారారు. కానీ మిథాలీ ఆటలో మాత్రం మెరుపు తగ్గలేదు. అద్భుతమైన బ్యాటింగ్‌తో, తనకే సాధ్యమైన రీతిలో కళాత్మకత, దూకుడు కలగలిపి భారత్ తరఫునే కాకుండా మహిళల క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్‌గా పేరు సంపాదించింది.
రోజువారీ ఖర్చులకు సరిపడా డబ్బులు లభించని సమయంలో తనకిష్టమైన భరత నాట్యాన్ని వదులుకొని క్రికెట్ పట్ల ప్రేమతో దానిని కెరీర్‌గా ఎంచుకున్న మిథాలీ టీవీల్లో వాణిజ్య ప్రకటనల్లో కనిపించే స్థాయికి ఎదిగింది. ఆమె ఆటకు సంబంధించి అంకెలు, గణాంకాలను పరిశీలిస్తే మిథాలీని అభిమానులు ఆప్యాయంగా ‘లేడీ సచిన్’ అని పిలుస్తారు.
Mithali Raj reflects on her glorious cricketing journey and the struggles behind it 📽️ pic.twitter.com/NwW3q5bukE
— ICC (@ICC) June 8, 2022
అంచెలంచెలుగా...
హైదరాబాద్ నగరంలోని సెయింట్ జాన్స్ అకాడమీలో క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్న మిథాలీ ఆ తర్వాత వేర్వేరు వయో విభాగాల్లో రాణిస్తూ తన ప్రత్యేకత చాటుకుంది. మహిళల క్రికెట్‌కు ఏమాత్రం గుర్తింపులేని సమయంలో దానిని కెరీర్‌గా ఎంచుకోవడం పెద్ద సాహసమే. అయితే మిథాలీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీలా రాజ్ తమ కూతురిని ఎల్లవేళలా ప్రోత్స హించారు.
1999లో వన్డే కెరీర్‌ను శతకంతో మొదలుపెట్టిన మిథాలీ... 2002లో టెస్టుల్లో అరంగేట్రం చేసింది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచినా... మూడో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మిథాలీకి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
కెప్టెన్‌గా అదుర్స్...
2003 వచ్చేసరికి భారత జట్టులో మిథాలీ స్థానం సుస్థిరమైపోయింది. 2005లో ఆమెకు తొలిసారి నాయకత్వ బాధ్యతలు లభించాయి. మిథాలీ కెప్టెన్సీలో భారత జట్టు 2005 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత కూడా మిథాలీ నేతృత్వంలో భారత జట్టు ఎన్నో మధుర విజయాలు సాధించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీలు, నాలుగు దేశాల టోర్నీలు ఉన్నాయి.
అందని ద్రాక్ష...
వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును (పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి) రెండుసార్లు ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పిన మిథాలీ రాజ్ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. ఆమె కెరీర్‌లో ఇది లోటుగా ఉండిపోనుంది. 2005 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్... 2017 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది.
అవమానం భరించి...
విండీస్ ఆతిథ్యమిచ్చిన 2018 టి20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మిథాలీ రాజ్‌ను తుది జట్టులో నుంచి తప్పించడం వివాదాస్పదమైంది. టోర్నీ సమయంలో అప్పటి చీఫ్ కోచ్ రమేశ్ పొవార్‌తోపాటు జట్టులోని ఇతర సీనియర్ సభ్యులు తను జట్టులో సభ్యురాలే కాదన్నట్లు ప్రవర్తించారని అప్పటి బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సాబా కరీమ్‌లకు మిథాలీ లేఖ రాయడం పెను దుమారం రేపింది.
ఈ వివాదం తర్వాత 2019లో టి20 నుంచి మిథాలీ వీడ్కోలు తీసుకుంది. వన్డే, టెస్టు ఫార్మాట్‌లపై మరింతగా దృష్టి సారించింది. కరోనా కారణంగా గత రెండేళ్లు పెద్దగా సిరీస్‌లు లేకపోయినా మిథాలీ ఆటలో నిలకడ కనబరుస్తూ వచ్చింది. ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ సారథ్యంలో భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా కనిపించినా... సమష్టి ప్రదర్శన లేకపోవడంతో భారత్ రౌండ్ రాబిన్ లీగ్‌లో ఐదో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
ఇదే చివరి ప్రపంచకప్
ఈ టోర్నీకి ముందే తనకు ఇదే చివరి ప్రపంచకప్ అని మిథాలీ ప్రకటించింది. దాంతో టోర్నీ ముగిశాక మిథాలీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతుందని అందరూ భావించారు. కానీ మిథాలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ నెలలో శ్రీలంకలో పర్యటనకు భారత వన్డే, టి20 జట్లను బుధవారం ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మిథాలీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది.
భారత మహిళల క్రికెట్‌కు మిథాలీ రాజ్ సేవలకు గుర్తింపుగా ఆమె కోసం ప్రత్యేకంగా ఫేర్‌వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావించింది. అయితే దీనిపై మిథాలీ ఆసక్తి చూపలేదని సమాచారం.
చదవండి: Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు!
Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం?
Comments
Please login to add a commentAdd a comment