ప‌రువు తీసుకుంటున్న పాక్‌, బంగ్లా క్రికెట‌ర్లు! | Mohammad Rizwan Heat Argument-With Litton Das BAN Vs PAK Test | Sakshi
Sakshi News home page

ప‌రువు తీసుకుంటున్న పాక్‌, బంగ్లా క్రికెట‌ర్లు!

May 19 2026 9:46 PM | Updated on May 19 2026 10:39 PM

Mohammad Rizwan Heat Argument-With Litton Das BAN Vs PAK Test

బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ల మ‌ధ్య సిల్హెట్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టు వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారిపోయింది. ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు తిట్ల పురాణంతో అంత‌ర్జాతీయ మ్యాచ్ అన్న విష‌యం మ‌రిచిపోయి ప‌రువు తీసుకుంటున్నారు. షాన్ మ‌సూద్‌, ముష్ఫిక‌ర్ ర‌హీమ్ గొడ‌వ మ‌రవ‌క ముందే తాజాగా నాలుగో రోజు ఆట‌లో మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, లిట‌న్ దాస్‌ల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

పాక్ ఇన్నింగ్స్ 72వ ఓవ‌ర్‌లో ఇది చోటుచేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న రిజ్వాన్.. సైడ్ స్క్రీన్ సరిగా లేదని అంపైర్‌కు ఫిర్యాదు చేస్తూ బౌలర్‌ను ఆపేశాడు. ఇది చూసిన బంగ్లా వికెట్‌ కీపర్‌ లిటన్ దాస్ జోక్యం చేసుకుని రిజ్వాన్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. 'ఏం చేస్తున్నావ్‌? అక్క‌డ ఏమి చూస్తున్నావ్‌? ఇక్కడ బ్యాటింగ్ చేయ్' అంటూ లిటన్ దాస్ వ్యాఖ్యానించాడు. 

లిట‌న్‌కు రిజ్వాన్ కూడా ధీటుగా బ‌దులిచ్చాడు. 'ఇది నీ పని కాదు.. అంపైర్ పని' అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. ఇంతటితో ఆగని లిటన్ దాస్.. '50 పరుగులు అయ్యాక ఇప్పుడు యాక్టింగ్ మొదలవుతుంది” అంటూ రిజ్వాన్‌ను ఎగతాళి చేసినట్లు స్టంప్ మైక్ లో వినిపించింది. 

ఈ వ్యాఖ్యలతో రిజ్వాన్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. తిట్ల పురాణం అనంత‌రం ఇద్ద‌రు కొట్టుకునేందుకు సిద్ధ‌మైన స‌మ‌యంలో అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. ఇప్ప‌టికే తొలి టెస్టులో ఓట‌మి చ‌విచూసిన పాకిస్తాన్‌ రెండో టెస్టులో విజ‌యం కోసం పోరాటం కొన‌సాగిస్తోంది. 

బంగ్లాదేశ్ నిర్దేశించిన 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల న‌ష్టానికి 316 పరుగులు చేసింది. విజయానికి మ‌రో 121 పరుగులు అవసరం కాగా, చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చివ‌రి రోజు టార్గెట్‌ను ఛేదించి పాక్ పరువు నిలుపుకుంటుందా లేక బంగ్లాదేశ్ చారిత్ర‌క విజ‌యాన్ని అందుకుంటుందా అన్న‌ది చూడాలి.

చదవండి: నితీశ్‌రెడ్డిపై అగార్కర్‌ ప్రశంసలు!

Advertisement
 
Advertisement
Advertisement