టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ పునరాగమనానికి ముహూర్తం ఖరారైంది. దాదాపు ఏడాది తర్వాత ఈ పేస్ బౌలర్ కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) ధ్రువీకరించింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు షమీ.
చీలమండ గాయానికి శస్త్ర చికిత్స
ఈ ఐసీసీ టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా 24 వికెట్లు కూల్చి.. టీమిండియా ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, అప్పటికే గాయం వేధిస్తున్నా పంటి బిగువన నొప్పిని భరించిన ఈ బెంగాల్ పేసర్... ఈ ఈవెంట్ తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
ఆ మ్యాచ్‌తో రీ ఎంట్రీ
ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. రీ ఎంట్రీ ఎప్పటికపుడు వాయిదా పడింది. అయితే, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు జాతీయ మీడియాకు అందించిన తాజా సమాచారం ప్రకారం.. షమీ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. రంజీ ట్రోఫీ 2024-25 తాజా ఎడిషన్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌తో బెంగాల్ ఆడబోయే మ్యాచ్‌తో షమీ కాంపిటేటివ్ క్రికెట్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
రంజీ ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా బెంగాల్- మధ్యప్రదేశ్ మధ్య ఇండోర్ వేదికగా బుధవారం(నవంబరు 13) ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక షమీ రాక గురించి బెంగాల్ అసోసియేషన్ వర్గాలు మాట్లాడుతూ.. షమీ వల్ల తమ పేస్ బౌలింగ్ అటాక్ మరింత పటిష్టమవుతుందని హర్షం వ్యక్తం చేశాయి. అతడి రాకతో జట్టులో కొత్త ఉత్సాహం నిండిందని... గొప్పగా రాణించే అవకాశం దక్కిందని పేర్కొన్నాయి.
ఆసీస్ టూర్‌కు?
కాగా రంజీ తాజా సీజన్‌లో బెంగాల్ జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. మొత్తంగా ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన షమీ.. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. షమీ రంజీల్లో పూర్తిస్థాయిలో ఆడగలిగితే.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే టీమిండియాలో అతడిని చేర్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఆసీస్ టూర్ వెళ్లిన భారత జట్టులో ప్రధాన పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఉన్నారు.
ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా!
Comments
Please login to add a commentAdd a comment