స్వదేశంలో గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన
న్యూఢిల్లీ: భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ చాలా కాలంగా టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. షమీ కూడా లేకపోవడంతో బుమ్రాకు జతగా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు.
అయితే పేస్‌కు అనుకూలించే విదేశీ మైదానాలతో పోలిస్తే సొంతగడ్డపై అతని ప్రదర్శన పేలవంగా ఉంది. 17 విదేశీ టెస్టుల్లో సిరాజ్ 61 వికెట్లు పడగొట్టాడు. భారత గడ్డపై మాత్రం 13 టెస్టుల్లో 192.2 ఓవర్లు బౌలింగ్ చేసి 36.15 సగటుతో 19 వికెట్లే తీయగలిగాడు! ఇందులో కొన్ని సార్లు స్పిన్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లపై దాదాపుగా బౌలింగ్ చేసే అవకాశమే రాకపోవడం కూడా ఒక కారణం. అయితే పిచ్‌తో సంబంధం లేకుండా స్వదేశంలో కూడా ప్రత్యరి్థపై చెలరేగే బుమ్రా, షమీలతో పోలిస్తే సిరాజ్ విఫలమవుతున్నాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలో బుమ్రా తరహాలో వికెట్లు అందించలేకపోతున్నాడు. ముఖ్యంగా గత ఏడు టెస్టుల్లో అతను 12 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి న్యూజిలాండ్‌తో పుణేలో జరిగే రెండో టెస్టులో అతని స్థానంపై సందేహాలు రేకెత్తుతున్నాయి.
సిరాజ్ స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరును మేనేజ్‌మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సిరాజ్ బౌలింగ్‌లో స్వల్ప సాంకేతిక లోపాలే భారత్‌లో వైఫల్యాన్ని కారణమని మాజీ కోచ్ ఒకరు విశ్లేíÙంచారు. ‘టెస్టుల్లో సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శనలన్నీ కేప్‌టౌన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, బ్రిస్బేన్‌వంటి బౌన్సీ పిచ్‌లపైనే వచ్చాయి.
బంతి పిచ్ అయిన తర్వాత బ్యాటర్ వరకు చేరే క్రమంలో అక్కడి లెంగ్త్‌కు ఇక్కడి లెంగ్త్‌కు చాలా తేడా ఉంటుంది. దీనిని అతను గుర్తించకుండా విదేశీ బౌన్సీ వికెట్ల తరహా లెంగ్త్‌లో ఇక్కడా బౌలింగ్ చేస్తున్నాడు. దీనికి అనుగుణంగా తన లెంగ్త్‌ను మార్చుకోకపోవడంతో ఫలితం ప్రతికూలంగా వస్తోంది. ఈ లోపాన్ని అతను సరిదిద్దుకోవాల్సి ఉంది. వన్డే, టి20ల్లో అయితే లెంగ్త్ ఎలా ఉన్నా కొన్ని సార్లు వికెట్లు లభిస్తాయి. కానీ టెస్టుల్లో అలా కుదరదు. బ్యాటర్ తగిన విధంగా సన్నద్ధమై ఉంటాడు. అయితే నా అభిప్రాయం ప్రకారం ఆ్రస్టేలియాకు వెళితే సిరాజ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు’ అని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment