భారత పారాలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు
గత విశ్వ క్రీడల పతకాల సంఖ్యను అధిగమించిన మన బృందం
ప్రస్తుతం భారత్ ఖాతాలో 22 పతకాలు
వరుసగా మూడో పారాలింపిక్స్‌లో తంగవేలుకు పతకం
ఆర్చరీలో స్వర్ణం నెగ్గిన హర్విందర్
ఊహించినట్లుగానే భారత పారాలింపియన్లు గత విశ్వ క్రీడలకంటే మరింత మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటారు. 2020 టోక్యో కీడల్లో ఓవరాల్‌గా 19 పతకాలు గెలుచుకున్న మన బృందం ఇప్పుడు దానిని అధిగమించింది. బుధవారం పోటీలు ముగిసేసరికి భారత్ ఖాతాలో మొత్తం 22 పతకాలు చేరాయి.
మంగళవారం అర్ధరాత్రి దాటాక హైజంప్‌లో శరద్ కుమార్, తంగవేలు మరియప్పన్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకోగా... ఆ తర్వాత జావెలిన్ త్రోలో ఇలాగే అజీత్ సింగ్, సుందర్ సింగ్ లకు వరుసగా రజత, కాంస్యాలు లభించాయి.
దీంతో మన బృందం టోక్యో ప్రదర్శనను దాటగా... షాట్‌పుట్‌లో సచిన్ సాధించిన రజతంతో, ఆర్చరీలో హర్విందర్ సింగ్ గెలిచిన స్వర్ణంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. వరుసగా మూడో పారాలింపిక్స్‌లోనూ పతకం గెలిచిన తమిళనాడు ప్లేయర్ తంగవేలు ప్రదర్శన ఈ క్రీడల్లో హైలైట్‌గా నిలిచింది.
పారిస్: పారాలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్ క్రీడాంశంలో పతకాల పంట పండింది. ఇప్పటికే జట్టుకు ఇందులో 11 మెడల్స్ లభించాయి. పురుషుల హైజంప్ టి63 ఈవెంట్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు పోడియంపై నిలిచారు. 1.88 మీటర్ల ఎత్తుకు జంప్ చేసిన శరద్ కుమార్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. సీనియర్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు ఈ ఈవెంట్‌లోనే కాంస్యం దక్కింది. అతను 1.85 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు.
మరో భారత ప్లేయర్ శైలేష్ కుమార్‌కు నాలుగో స్థానం (1.85 మీటర్లు) దక్కింది. ఇద్దరి స్కోర్లూ సమానంగానే ఉన్నా... తక్కువసార్లు విఫలమైన తంగవేలుకు పతకం ఖరారైంది. ఈ పోటీలో ఎజ్రా ఫ్రెంచ్ (అమెరికా; 1.94 మీటర్లు) స్వర్ణ పతకం సాధించాడు. ఆ తర్వాత పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్‌లో భారత అథ్లెట్ అజీత్ సింగ్ రజత పతకం సొంతం చేసుకున్నాడు.
అతను తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేస్తూ జావెలిన్‌ను 65.62 మీటర్ల దూరం విసిరాడు. అతని తర్వాత మూడో స్థానంలో నిలిచి సుందర్ సింగ్ గుర్జర్ కాంస్యం గెలుచుకున్నాడు. సుందర్ విసిరిన జావెలిన్ 64.96 మీటర్లు వెళ్లింది. ఇందులో క్యూబాకు చెందిన గిలెర్మో గొంజాలెజ్ (66.14 మీటర్లు) స్వర్ణం గెలుచుకున్నాడు.
హర్విందర్ ‘పసిడి’ గురి
పురుషుల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో హర్విందర్ 6–0తో (28–24, 28–27, 29–25) లుకాస్ సిస్‌జెక్ (పోలాండ్)పై గెలుపొందాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో హరి్వందర్ కాంస్య పతకాన్ని గెలిచాడు.
సత్తా చాటిన సచిన్...
పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్‌లో భారత ఆటగాడు సచిన్ ఖిలారి రజత పతకంతో మెరిశాడు. ఈ ఈవెంట్‌లో ప్రపంచ చాంపియన్ అయిన సచిన్ తన రెండో ప్రయత్నంలో ఇనుప గుండును అత్యుత్తమంగా 16.32 మీటర్లు విసిరాడు. స్కూల్‌లో చదివే రోజుల్లోనే జరిగిన ప్రమాదం తర్వాత నుంచి సచిన్ ఎడమచేయి పని చేయలేదు.
పలు శస్త్రచికిత్సల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. 2015లో ఆటల్లోకి ప్రవేశించి ముందుగా జావెలిన్‌లో ప్రయత్నం చేసిన అతను ఆ తర్వాత షాట్‌పుట్‌కు మారాడు. గత ఆసియా పారా క్రీడల్లో అతను స్వర్ణం సాధించాడు. మెకానికల్ ఇంజినీర్ అయిన సచిన్ ప్రస్తుతం పలు విద్యా సంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు.
మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. టోక్యోలో రజతం సాధించిన భవీనా ఈసారి క్వార్టర్స్‌లో 12–14, 9–11, 11–8, 6–11 స్కోరుతో యింగ్ జూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. షూటింగ్‌లో 50 మీటర్ల మిక్స్‌డ్ పిస్టల్ ఈవెంట్ (ఎస్‌హెచ్1)లో భారత ఆటగాళ్లు నిహాల్ సింగ్, రుద్రాంశ్ ఖండేల్‌వాల్ క్వాలిఫయింగ్‌లోనే విఫలమైన ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment