భారత జట్టును నడిపించేటప్పుడు ‘కెప్టెన్ కూల్’గానే కనిపించిన ధోని పసుపు రంగు దుస్తుల్లో ‘హాట్’గా మారిపోతాడేమో? గత ఏడాది ఐపీఎల్‌లో రాజస్తాన్‌తో మ్యాచ్‌లోనే మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదనకు దిగిన ధోని మంగళవారం కూడా అదే తరహాలో ప్రవర్తించాడు. దీపక్ చహర్ వేసిన రాయల్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదో బంతికి టామ్ కరన్‌ను అంపైర్ షంషుద్దీన్ అవుట్ (కీపర్ క్యాచ్)గా ప్రకటించాడు. అయితే కరన్ మాత్రం కదలకుండా అక్కడే నిలబడిపోయాడు.
తన నిర్ణయంపై సందేహం వచ్చిన షంషుద్దీన్ మరో అంపైర్ వినీత్ కులకర్ణితో చర్చించి థర్డ్ అంపైర్‌గా నివేదించగా అది నాటౌట్‌గా తేలింది. బంతి కరన్ బ్యాట్‌కు తగలకపోగా... ధోని కూడా బంతి నేలను తాకిన తర్వాతే అందుకున్నాడు. అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై మళ్లీ చర్చ ఏమిటంటూ ధోని అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ తప్పు చేయడం వాస్తవమే అయినా... తమ నిర్ణయాన్ని పునస్సమీక్షించే అధికారం నిబంధనల ప్రకారం ఫీల్డ్ అంపైర్లకు ఉంది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో అంచనా తప్పని ధోని... క్యాచ్ కాని క్యాచ్ కోసం ఇంతగా వాదించడం ఆశ్చర్యకరంగా అనిపించింది!
Comments
Please login to add a commentAdd a comment