మూడుసార్లు చాంపియన్... ఐదుసార్లు రన్నరప్... ఒక్కసారి మినహా ఆడిన ప్రతీ సీజన్‌లో టాప్–4లో స్థానం... ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) రికార్డు ఎంతో ప్రత్యేకం. నిషేధం తర్వాత తిరిగొచ్చి ఒకసారి విజేతగా, మరోసారి రన్నరప్‌గా కూడా చెన్నై నిలవగలిగింది. కానీ 2020లో ఆ జట్టు ప్రదర్శన చూసిన తర్వాత ఒక్కసారిగా అభిమానులకు కూడా నీరసం వచ్చేసింది.
ఒక్క ఆటగాడు కూడా తగినంతగా రాణించకపోవడంతో ‘సీనియర్ సిటిజన్ టీమ్’ అంటూ వినిపించే వ్యంగ్యాస్త్రాలు మళ్లీ మొదలయ్యాయి. ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ఈసారి కూడా దాదాపు అదే ‘కోర్ గ్రూప్’తో సీఎస్‌కే బరిలోకి దిగుతుండటం వల్ల కావచ్చు అంచనాలు కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే సూపర్ కింగ్స్‌కు కర్త, కర్మ, క్రియగా సర్వం తానే అయి నడిపించే ధోని ఉండగా ఏదీ అసాధ్యం కాదని ఆ జట్టు నమ్ముతోంది. బలమైన నాయకత్వంలో వెటరన్ ఆటగాళ్లతో నిండిన చెన్నై టీమ్ ఎలాంటి ఫలితాలు సాధించగలదనేది ఆసక్తికరం.
కొత్తగా వచ్చినవారు...
ఐపీఎల్ వేలానికి ముందు చెన్నైకి ఒక విదేశీ టాపార్డర్ బ్యాట్స్‌మన్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్, ఆఫ్ స్పిన్నర్ అవసరం కనిపించింది. లీగ్‌లో ఆ జట్టు భారీ మొత్తం వెచ్చించిన ఇద్దరు టాప్ ప్లేయర్లు ఆఫ్ స్పిన్ వేస్తూ ధాటిగా బ్యాటింగ్ చేయగలవారే కావడం విశేషం. వేలంలో సీఎస్‌కే కృష్ణప్ప గౌతమ్ (రూ. 9.25 కోట్లు), మొయిన్ అలీ (రూ. 7 కోట్లు)లను తీసుకుంది. టెస్టు స్పెషలిస్ట్ పుజారా (రూ. 50 లక్షలు) ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించినా... నెమ్మదైన చెపాక్ స్టేడియం పిచ్‌లపై అతని శైలి ఆటగాడు ఒకరు జట్టులో ఉంటే మంచిదని భావించి ఉండవచ్చు. ఈ ముగ్గురు కాకుండా కనీస ధర రూ. 20 లక్షల చొప్పున ముగ్గురు వర్ధమాన క్రికెటర్లను ఎంపిక చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన భగత్ వర్మ, ఆంధ్ర ఆటగాడు హరిశంకర్ రెడ్డిలతో పాటు సి.హరి నిశాంత్ టీమ్‌లోకి వచ్చారు. విదేశీ టాపార్డర్ బ్యాట్స్‌మన్ లేని లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా డుప్లెసిస్ విఫలమైతే మరో ప్రత్యామ్నాయాన్ని అందుబాటులో ఉంచుకుంటే బాగుండేది.
తుది జట్టు అంచనా/ఫామ్
గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపర్చిన తర్వాత కూడా చెన్నై మరోసారి దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశాలు ఉండటంతో మెరుగైన ఫలితాలపై మళ్లీ సందేహాలు రేకెత్తుతున్నాయి. ఆటగాళ్ల తాజా ఫామ్‌ను బట్టి చూస్తే నలుగురు విదేశీ ఆటగాళ్లుగా తొలి ప్రాధాన్యత డు ప్లెసిస్, స్యామ్ కరన్, అలీ, తాహిర్‌లకు దక్కవచ్చు. సీజన్ మధ్యలో బ్రేవో, సాన్‌ట్నర్‌లకు అవకాశం దక్కవచ్చు. అలీ, కరన్‌లకు ఇటీవలే భారత గడ్డపై ఆడిన అనుభవం ఉండటం జట్టుకు మేలు చేసే అంశం. అయితే 37 ఏళ్ల డు ప్లెసిస్ ఇటీవల పేలవంగా ఆడుతున్న నేపథ్యంలో ఏమాత్రం ప్రభావం చూపించగలడో చూడాలి. రైనా పునరాగమనం చేయడం మంచిదే అయినా... 2019 ఐపీఎల్ నుంచి రాబోయే ఐపీఎల్ వరకు దాదాపు రెండేళ్ల మధ్య కాలంలో అతను కేవలం ఐదంటే ఐదు టి20 మ్యాచ్‌లే ఆడి మూడింట్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు.
ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా కేవలం నెట్స్ సాధనతో అతను ఏమాత్రం సత్తా చాటుతాడనేది సందేహమే! గాయం నుంచి కోలుకున్న జడేజా నేరుగా లీగ్ బరిలోకి దిగుతుండగా... టీమిండియా రెగ్యులర్ సభ్యుడిగా ప్రస్తుతం చురుగ్గా ఉన్న ఆటగాడు శార్దూల్ ఠాకూర్ ఒక్కడే. పుజారాకు ఎన్ని మ్యాచ్‌లలో అవకాశం వస్తుందో చూడాలి. గత సీజన్‌లో రాయుడు పెద్దగా ప్రభావం చూపలేదు. ఉతప్ప, రుతురాజ్‌లపై బ్యాటింగ్ భారం ఉండగా ... ఆల్‌రౌండర్‌గా గౌతమ్ ప్రభావం చూపించాల్సి ఉంది. బౌలింగ్‌లో దీపక్ చహర్ కీలకం కానున్నా డు. ఈసారి కూడా మ్యాచ్‌లు చెన్నైలో లేకపోవడం మరో ప్రతికూలత. అయితే అన్నింటికి మించి ఎప్పటిలాగే ధోని బ్యాటింగ్, అతని నాయకత్వంపైనే అందరి దృష్టీ ఉంది. ఆటగాడిగా ఇది అతనికి ఆఖరి సీజన్ కావచ్చని వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా టీమ్‌ను నడిపిస్తాడనేది చూడాలి.
జట్టు వివరాలు
భారత ఆటగాళ్లు: ధోని (కెప్టెన్), రైనా, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, రాయుడు, పుజారా, కరణ్ శర్మ, రాబిన్ ఉతప్ప, కృష్ణప్ప గౌతమ్, రుతురాజ్ గైక్వాడ్, భగత్ వర్మ, హరిశంకర్ రెడ్డి, హరి నిశాంత్, జగదీశన్, కేఎస్ ఆసిఫ్, సాయి కిషోర్.
విదేశీ ఆటగాళ్లు: తాహిర్, మొయిన్ అలీ, డు ప్లెసిస్, బ్రేవో, ఇన్‌గిడి, సాన్‌ట్నర్, స్యామ్ కరన్. సహాయక సిబ్బంది: ఫ్లెమింగ్ (హెడ్ కోచ్), హస్సీ (బ్యాటింగ్ కోచ్), ఎల్.బాలాజీ (బౌలింగ్ కోచ్), రాజీవ్ (ఫీల్డింగ్ కోచ్).
అత్యుత్తమ ప్రదర్శన
2010, 2011, 2018లో చాంపియన్
2020లో ప్రదర్శన: చెన్నై ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త ప్రదర్శన 2020లో నమోదు చేసింది. 14 మ్యాచ్‌లలో 6 మాత్రమే గెలిచిన టీమ్, ఒక దశలో ఆఖరి స్థానంలో నిలిచేలా కనిపించినా... స్వల్ప రన్‌రేట్ తేడాతో రాజస్తాన్‌ను వెనక్కి నెట్టి చివరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆడిన 11 సీజన్లలో ఆ జట్టు టాప్–4లో నిలబడకపోవడం ఇదే మొదటిసారి. లీగ్ ఆరంభానికి ముందే వ్యక్తిగత కారణాలతో రైనా, హర్భజన్ తప్పుకున్నా వారి స్థానంలో మరెవరినీ తీసుకోకపోవడం... రెండో అర్ధభాగానికి వచ్చేసరికి సత్తువ సన్నగిల్లడంతో వరుస పరాజయాలు తప్పలేదు. మిడిలార్డర్‌లో ధోని, జాదవ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా... చెన్నై పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టులోకి తీసుకున్న స్పిన్నర్లు యూఏఈకి వచ్చేసరికి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
సాక్షి క్రీడావిభాగం:
Comments
Please login to add a commentAdd a comment