సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని ముంబై జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన ఫైనల్లో ముంబై మధ్యప్రదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్.. కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి మధ్యప్రదేశ్‌కు ఫైటింగ్ టోటల్ అందించాడు. ఇన్నింగ్స్ చివరి రెండు ఓవర్లలో పాటిదార్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సుభ్రాన్షు సేనాపతి (23), హర్ప్రీత్ సింగ్ (15), వెంకటేశ్ అయ్యర్ (17), రాహుల్ బాథమ్ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆర్పిత్ గౌడ్ (3), హర్ష్ గావ్లి (2), త్రిపురేశ్ సింగ్, శివమ్ శుక్లా (1) సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్‌స్టన్ డయాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకోలేకర్, శివమ్ దూబే, సుయాంశ్ షేడ్గే తలో వికెట్ దక్కించుకున్నారు.
రాణించిన రహానే, స్కై.. షేడ్గే, అంకోలేకర్ ఊచకోత
175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఆదిలోనే పృథ్వీ షా (10) వికెట్ కోల్పోయింది. అయితే రహానే (30 బంతుల్లో 37), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9 బంతుల్లో 16) ఏమాత్రం తగ్గకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48) తనదైన స్టయిల్‌లో విరుచుకుపడ్డాడు.
చివర్లో శివమ్ దూబే (6 బంతుల్లో 9), అథర్వ అంకోలేకర్ (6 బంతుల్లో 16 నాటౌట్), సూర్యాంశ్ షేడ్గే (15 బంతుల్లో 36 నాటౌట్) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి ముంబైని గమ్యానికి చేర్చారు. ముఖ్యంగా షేడ్గే మధ్యప్రదేశ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అంకోలేకర్ సిక్సర్ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
దేశవాలీ క్రికెట్‌లో ముంబైకు ఇది 63వ టైటిల్. రెండో సయ్యద్ ముస్తాక్ అలీ టైటిల్. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన రహానేకు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు, ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్యాంశ్ షేడ్గేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు లభించాయి. సూర్యాంశ్ షేడ్గేను ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కేవలం 30 లక్షలకు సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment