‘చాంపియన్స్’ సమరంలో చెన్నైదే విజయం
20 పరుగులతో ఓడిన ముంబై
మెరిపించిన రుతురాజ్, దూబే, ధోని
4 వికెట్లతో పతిరణ విజృంభణ
రోహిత్ శర్మ శతకం వృథా
ముంబై: ఐపీఎల్ ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ల సమరంలో ముంబై ఇండియన్స్‌పై డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) పైచేయి సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పతిరణ (4/28) తన పేస్‌తో ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీస్కోరు చేసింది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసి ఓడింది. రోహిత్ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) తన టి20 కెరీర్‌లో ఎనిమిదో శతకం చేసినా ఫలితం లేకపోయింది.
దూబే, రుతురాజ్ ఫిఫ్టీ–ఫిఫ్టీ
ఓపెనర్ రహానే (5) అవుటయ్యాక రచిన్ రవీంద్రకు జతయిన కెప్టెన్ రుతురాజ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. పవర్‌ప్లేలో 48/1 స్కోరు చేయగా... కాసేపటికి రచిన్ (16 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) నిష్క్రమించాడు. శివమ్ దూబే వచ్చాక చెన్నై స్కోరు, జోరు పెరిగాయి.
దూబే బౌండరీలతో, రుతురాజ్ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో 12వ ఓవర్లో చెన్నై స్కోరు 100 దాటింది. ముందుగా గైక్వాడ్ 33 బంతుల్లో, తర్వాత దూబే 28 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. హార్దిక్ బౌలింగ్‌లో రుతురాజ్ అవుటవడంతో మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మిచెల్ (17) పెద్దగా మెరిపించలేదు.
ధోని 6,6,6,2....
ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన ధోని... చెన్నై ఇన్నింగ్స్‌నే కాదు తన మునుపటి శైలి సిక్సర్లతో మొత్తం వాంఖేడేను మోతెక్కించాడు. 20వ ఓవర్‌లో మిగిలిపోయిన 4 బంతుల్ని ఆడిన ధోని వరుసగా 6, 6, 6, 2లుగా బాదేయడంతో హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో మొత్తం 26 పరుగులు వచ్చాయి.
రోహిత్ ఒక్కడే...
లక్ష్యానికి తగిన వేగాన్ని ఆరంభం నుంచి జతచేసిన ముంబై ఓపెనర్లు ఇషాన్ (15 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్‌లు పవర్ ప్లే (63/0)లో ఓవర్‌కు పది పరుగుల చొప్పున సాధించారు. కానీ 8వ ఓవర్ వేసిన పతిరణ తొలి బంతికి కిషన్‌ను, మూడో బంతికి హిట్టర్ సూర్య (0)ను అవుట్ చేసి చెన్నై శిబిరాన్ని ఆనందంలో ముంచాడు.
కానీ అవతలివైపు రోహిత్ 30 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. తిలక్ వర్మ (20 బంతుల్లో 31; 5 ఫోర్లు) వేగానికీ పతిరణే కళ్లెం వేశాడు. హార్దిక్ (2) వచ్చివెళ్లగా, రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చిన డేవిడ్ (13), షెఫర్డ్ (1) వెంటవెంటనే అవుట్ కాగానే ముంబై ఆశలు ఆవిరయ్యాయి.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) పాండ్యా (బి) కొయెట్జీ 5; రచిన్ (సి) ఇషాన్ (బి) శ్రేయస్ గోపాల్ 21; రుతురాజ్ (సి) నబీ (బి) పాండ్యా 69; దూబే (నాటౌట్) 66; మిచెల్ (సి) నబీ (బి) పాండ్యా 17; ధోని (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–8, 2–60, 3–150, 4–186. బౌలింగ్: నబీ 3–0–19–0, కొయెట్జీ 4–0–35–1, బుమ్రా 4–0– 27–0, ఆకాశ్ 3–0–37–0, శ్రేయస్ గోపాల్ 1–0– 9–1, పాండ్యా 3–0–43–2, రొమరియో షెఫర్డ్ 2–0–33–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) శార్దుల్ (బి) పతిరణ 23; సూర్యకుమార్ (సి) ముస్తఫిజుర్ (బి) పతిరణ 0; తిలక్ వర్మ (సి) శార్దుల్ (బి) పతిరణ 31; హార్దిక్ (సి) జడేజా (బి) తుషార్ 2; టిమ్ డేవిడ్ (సి) రవీంద్ర (బి) ముస్తఫిజుర్ 13; షెఫర్డ్ (బి) పతిరణ 1; నబీ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–70, 2–70, 3–130, 4–134, 5–148, 6–157. బౌలింగ్: తుషార్ 4–0–29–1, ముస్తఫిజుర్ 4–0–55–1, శార్దుల్ 4–0–35–0, జడేజా 4–0–37–0, పతిరణ 4–0–28–4.
ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు X హైదరాబాద్
వేదిక: బెంగళూరు
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment