
బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల రహీమ్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022లో టీ20లకు వీడ్కోలు పలికిన రహీమ్.. ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ముష్పికర్ వెల్లడించాడు.
అన్నివిధాలగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రహీమ్ తెలిపాడు. కాగా పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రహీమ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో రహీమ్ వన్డేలకు విడ్కోలు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది.
"నేను ఈరోజు నుంచి వన్డే ఫార్మాట్ నుండి రిటైర్ అవుతున్నాను. నా కెరీర్‌లో ఇప్పటివరకు సాధించిన ప్రతీ విజయం వెనక ఆ దేవుడు ఉన్నాడు. ప్రపంచ స్థాయిలో మేము సాధించిన పరిమితం అయినప్పటికీ.. నేను మాత్రం నా దేశం కోసం ఎంతో నిజాయతీతో, అంకితభావంతో పనిచేశాను.
గత కొన్ని వారాలగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. ఇక టెస్టు క్రికెట్‌పై మరింత దృష్టిసారిస్తాను. నాకు మద్దతుగా నిలిచిన బంగ్లా క్రికెట్‌కు, అభిమానులకు, సహచరులకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను" అని ముష్ఫికర్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చాడు.
2006లో జింబాబ్వేతో జరిగిన వన్డేతో రహీమ్ బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన కెరీర్‌లో బంగ్లా తరపున 274 వన్డేలు ఆడిన ముష్ఫికర్.. 36.42 సగటుతో 7,795 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన రికార్డు రహీమ్ పేరిటే ఉంది. అదేవిధంగా వికెట్ కీపర్‌గా కూడా ముష్ఫికర్ 243 క్యాచ్‌లు అందుకున్నాడు.
చదవండి: సచిన్ హాఫ్ సెంచరీ వృథా.. భారత్‌ను చిత్తు చేసిన ఆసీస్
Comments
Please login to add a commentAdd a comment