ప్రాక్టీస్ సెషన్‌లో రహానే, కోహ్లి
చెన్నై: రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి రావడంతో జట్టులో తన పని, పాత్ర సులువైందని వైస్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండోసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే ఇప్పుడు తన రెగ్యులర్ కెప్టెన్‌కు చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పాడు. త్వరలో జరిగే టెస్టు సిరీస్‌పైనే దృష్టి పెట్టామని, ప్రత్యర్థి జట్టును గౌరవిస్తామని అన్నాడు. ‘శ్రీలంకలో నెగ్గొచ్చిన ఇంగ్లండ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోం. జో రూట్ బృందం బలమైన ప్రత్యర్థి. అలాంటి జట్టుపై ఆదమరిచే ప్రసక్తే లేదు’ అని రహానే తెలిపాడు. ‘ఇప్పుడు నేను వైస్‌కెప్టెన్‌ని. మా సారథి వెంట నడవాలి. జట్టుకు అవసరమైనపుడు సలహాలిస్తాను. కోహ్లి కోరితే సూచనలిస్తాను. వైస్ కెప్టెన్‌గా నా పరిధి ఏంటో నాకు తెలుసు. ఇక ఆసీస్ విజయం ఇప్పుడైతే అప్రస్తుతం. ఎందుకంటే అది గతం. ఇప్పుడున్న సిరీస్‌పైనే మా ఫోకస్ ఉంటుంది. అక్కడ గెలిచామ న్న ధీమాతో ఇక్కడ ప్రవర్తించం. పైగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రత్యర్థి ఎవరైనా పట్టుదలతోనే ఆడతాం’ అని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment