అగస్త్యను హార్దిక్‌ ఇంటికి పంపిన నటాషా.. ఫొటో వైరల్‌! | Natasa Drops Agastya At Hardik Pandya's Place, Krunal's Wife Share Pics Goes Viral | Sakshi
Sakshi News home page

అగస్త్యను హార్దిక్‌ పాండ్యా ఇంటికి పంపిన నటాషా.. ఫొటో వైరల్‌

Published Wed, Sep 4 2024 1:44 PM | Last Updated on Wed, Sep 4 2024 2:59 PM

Natasa Drops Agastya At Hardik Pandya's Place, Krunal's Wife Share Pics Goes Viral

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా ఇప్పట్లో జట్టులోకి వచ్చే అవకాశం లేదు. మరో నెల రోజుల పాటు అతడికి విశ్రాంతి లభించనుంది. దీంతో విరామ సమయాన్ని పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తూ మనోల్లాసం పొందుతున్నాడు హార్దిక్‌. ఇక ఇప్పుడు కుమారుడు అగస్త్య కూడా తన దగ్గరికి వచ్చేయడంతో మరింత ఖుషీ ఖుషీగా గడుపుతున్నట్లు తెలుస్తోంది.

తల్లితో సెర్బియా వెళ్లిన అగస్త్య
కాగా హార్దిక్‌ పాండ్యా ఇటీవలే తన భార్య, సెర్బియా మోడల్‌ నటాషా స్టాంకోవిక్‌ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సామరస్యపూర్వకంగానే తాము విడిపోతున్నామని.. అగస్త్యకు తల్లిదండ్రులుగా మాత్రం కొనసాగుతామని ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం కుమారుడిని తీసుకుని నటాషా పుట్టింటికి వెళ్లిపోయింది.

అయితే, తాజాగా అగస్త్య తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. సెర్బియా నుంచి ఈ చిన్నారి ముంబైకి చేరుకున్నాడు. హార్దిక్‌ వదిన, క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యా భార్య పాంఖురి శర్మ షేర్‌ చేసిన ఫొటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. తన కుమారుడు కవిర్‌తో కలిసి అగస్త్యకు కథలు చెప్తున్నానంటూ పాంఖురి ఇన్‌స్టాలో స్టోరీ షేర్‌ చేసింది.

కెరీర్‌ పరంగానూ ఒడిదొడుకులు
కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2024లో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యా... జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ అనంతరం అతడే సారథి అవుతాడని విశ్లేషకులు భావించారు. అయితే అనూహ్యం అతడిని వైస్‌ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించింది బీసీసీఐ. 

శ్రీలంక పర్యటన -2024 సందర్భంగా సూర్యకుమార్‌ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించడంతో పాటు.. శుబ్‌మన్‌ గిల్‌ను అతడికి డిప్యూటీగా నియమించింది. ఫిట్‌నెస్‌ కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో హార్దిక్‌ పాండ్యా కేవలం వన్డే, టీ20లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. 

శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు ఆటకు దూరమయ్యాడు. ఇక రోహిత్‌ సేన సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ ఆడనుండగా.. అక్టోబరు 6 నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్‌ సందర్భంగా హార్దిక్‌ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement