ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. రెండోరోజు ఆటలో భాగంగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. మూడోరోజు ఉదయం ఏమైనా అద్భుతం జరిగితే తప్ప ఆసీస్ గెలుపును అడ్డుకోవడం కష్టమే. బంతి అనూహ్యంగా టర్న్ అవుతున్నప్పటికి లక్ష్యం చిన్నది కావడంతో ఆసీస్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ 8 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను లియోన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
►టీమిండియా గడ్డపై బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అందుకున్న మూడో ఆటగాడిగా నాథన్ లియోన్ నిలిచాడు. భారత గడ్డపై లియోన్ ఒక ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల ఫీట్ నమోదు చేయడం ఇది రెండోసారి. ఇంతకముందు 2016-17 పర్యటనలో బెంగళూరు వేదికగా జరిగిన టెస్టులో 50 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇక తాజాగా 64 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు.
►న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. 2021-22లో భారత్‌లో పర్యటించిన కివీస్ జట్టు.. ముంబై వేదికగా ఆడిన టెస్టులో ఎజాజ్ పటేల్ ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. కుంబ్లే తర్వాత టెస్టుల్లో ఈ ఫీట్ అందుకున్న బౌలర్‌గా నిలిచాడు.
►టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లియోన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో లంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ను వెనక్కి నెట్టాడు.
►ఇక టెస్టుల్లో లియోన్ పుజారాను 13వ సారి ఔట్ చేశాడు. ఒక బ్యాటర్‌ను అత్యధికసార్లు ఔట్ చేసిన బౌలర్‌గా లియోన్ నిలిచాడు.
►భారత గడ్డపై అత్యధికసార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్న లియోన్ (ఐదుసార్లు).. రిచీ బెనాడ్స్ రికార్డును సమం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment