ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించిన నేపాల్ (PC: CAN)
Asia Cup 2023: నేపాల్ క్రికెట్ జట్టు తొలిసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ మెన్స్ ప్రీమియర్ కప్ ఫైనల్లో యూఏఈని ఓడించి మెగా ఈవెంట్ బెర్తు ఖరారు చేసుకుంది. నేపాల్- యూఏఈ మధ్య మంగళవారం ఖాట్మండు వేదికగా మ్యాచ్ జరిగింది.
ఈ క్రమంలో గుల్షన్ కుమార్ ఝా 67 పరుగులతో చెలరేగిన నేపథ్యంలో నేపాల్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసియా కప్ ఈవెంట్‌కు అర్హత సాధించిన నేపాల్ గ్రూప్-ఏలో చోటు దక్కించుకుంది. ఇండియా, పాకిస్తాన్ జట్లతో చేరి పోటీకి సిద్ధమైంది.
4 వికెట్లు పడగొట్టిన రాజ్ బన్షీ
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న నేపాల్.. యూఏఈని 117 పరుగులకే కట్టడి చేసింది. రాజ్‌బన్షీ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టగా.. కరణ్ కేసీ, సందీప్ లమిచానే రెండేసి వికెట్లు కూల్చారు. సోంపాల్ కామీ, గుల్షన్ ఝా చెరె వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 33.1 ఓవర్లకే యూఏఈ కథ ముగిసింది.
ఆదిలోనే ఎదురుదెబ్బ.. అయినా గానీ
ఇక లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కుశాల్ భూర్టెల్ 1, ఆసిఫ్ షేక్ 8 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ గుల్షన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత నెత్తికెత్తుకున్నాడు.
84 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 67 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.అతడి తోడుగా భీహ్ షార్కీ 72 బంతుల్లో 36 పరుగులతో పట్టుదలగా నిలబడ్డాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా 30.3 ఓవర్లలోనే నేపాల్ టార్గెట్ ఛేదించింది.
అలాంటిదేమీ లేదు
ఇదిలా ఉంటే.. ఆసియా వన్డే కప్-2023 టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తమ ఆటగాళ్లను పాక్‌కు పంపే పరిస్థితి లేదని కరాఖండిగా చెప్పింది. దీంతో హైబ్రీడ్ మోడల్ అవలంబించాలని యోచించినా బీసీసీఐ అందుకు తిరస్కరించిందనే వార్తలు వినిపించాయి. అంతేగాక ఆసియా కప్ రదద్దు చేసి.. ఐదు దేశాలతో టోర్నీ ప్లాన్ చేయాలని భావిస్తోందని వదంతులు వ్యాపించాయి.
ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారి ఒకరు స్పందిస్తూ.. ఆసియా కప్ రదద్దు, వాయిదా గురించి చర్చ జరుగలేదని వివరణ ఇచ్చారు. ఇలాంటివేమైనా ఉంటే సమావేశం నిర్వహించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
చదవండి: గొప్ప క్రికెటర్లే కావొచ్చు.. కానీ ఇది మరీ ఎక్కువైంది! కోహ్లిని చూసి ఏం నేర్చుకుంటారు?
Comments
Please login to add a commentAdd a comment