
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఘోర ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలో కూడా అదే తీరును కనబరుస్తోంది. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ ఘోర ఓటమితో ప్రారంభించింది.
ఆదివారం క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 9 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.4 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. కివీస్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగారు.
ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే పాకిస్తాన్ వికెట్ల పతనం మొదలైంది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 4 వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించగా.. కైల్ జేమిసన్ మూడు, ఇష్ సోది రెండు వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ బ్యాటర్లలో కుష్దిల్ షా(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సీఫర్ట్ విధ్వంసం..
అనంతరం 92 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఒక్క వికెట్ కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలో ఊదిపడేసింది. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఫిన్ అలెన్(29),రాబిన్‌సన్(18) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. పాక్ బౌలర్లలో అర్బర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
టీమ్ మారినా..
ఇక కివీస్‌తో టీ20 సిరీస్‌కు దాదాపుగా కొత్త టీమ్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలక్టర్లు ఎంపిక చేశారు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్ వంటి స్టార్ ఆటగాళ్లపై పీసీబీ వేటు వేసింది. వారి స్ధానంలో హసన్ నవాజ్, ఇర్ఫాన్ ఖాన్, అబ్దుల్ సమద్ వంటి యువ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశమిచ్చారు.
కానీ వీరివ్వరూ కూడా తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చకోలేకపోయారు. దీంతో పాకిస్తాన్ సెలకర్టపై మరోసారి విమర్శల వర్షం కురిపిస్తుంది. బాబర్, రిజ్వాన్‌ను తప్పించాల్సిన అవసరం ఏముంది అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
చదవండి: WPL 2025: ఫైనల్లో ఓటమి.. బోరున ఏడ్చేసిన ఢిల్లీ ప్లేయర్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment