
తాను అవకాశాల కోసం అడిగే వ్యక్తిని కాదని టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) అన్నాడు. తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో తెలియదని.. ఈ విషయం గురించి మేనేజ్‌మెంట్ నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా తనకు పిలుపునిస్తారని ఆశగా ఎదురుచూశానని.. అయితే, సెలక్టర్లు మరోసారి మొండిచేయే చూపారని ఆవేదన వ్యక్తం చేశాడు.
జట్టులో అవకాశాలు కరువు
కాగా ఒకప్పుడు టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్(Vice Captain)గా వెలుగొందిన అజింక్య రహానే.. తాత్కాలిక సారథిగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు విజయం అందించాడు. విదేశాల్లోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న ఈ ముంబై బ్యాటర్‌కు గత కొన్నేళ్లుగా జట్టులో అవకాశాలు కరువయ్యాయి.
అయితే, దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి.. ఐపీఎల్‌లోనూ తనను తాను నిరూపించుకున్న రహానే.. అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC)-2023 ఫైనల్(ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా)కు ఎంపికయ్యాడు.
అనంతరం వెస్టిండీస్ పర్యటనలో టెస్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. కానీ ఆ టూర్లో వైఫల్యం తర్వాత రహానేకు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపురాలేదు. ఈ క్రమంలో దేశీ క్రికెట్‌పై దృష్టి సారించిన అతడు.. ముంబై కెప్టెన్‌గా గతేడాది రంజీ ట్రోఫీ టైటిల్ అందుకున్నాడు. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటాడు.
ఇక ప్రస్తుతం రంజీ సెమీ ఫైనల్స్‌తో బిజీగా ఉన్న అజింక్య రహానే టీమిండియా పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘జట్టు నుంచి నన్ను ఎందుకు తప్పించారని ప్రశ్నించే రకం కాదు. అసలు మేనేజ్‌మెంట్‌తో నాకు కమ్యూనికేషన్ లేదు. చాలా మంది వెళ్లి మాట్లాడమని చెప్పారు.
అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడు
అందుకు నేను సిద్ధంగా ఉన్నా.. ఎదుటి వ్యక్తి కూడా అందుకు సుముఖంగా ఉండాలి కదా!.. ఒకవేళ అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడు నేను పోరాడటంలో అర్థం ఉండదు. నేను నేరుగా అతడితోనే మాట్లాడాలనుకున్నా. అందుకే మెసేజ్‌లు చేయలేదు. ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది’’ అంటూ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అదే విధంగా.. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించడం బాధ కలిగించింది. తదుపరి సిరీస్‌లలో నన్ను ఆడిస్తారని అనుకున్నా. కానీ నా చేతుల్లో ఏం లేదు కదా! ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాను. ఐపీఎల్‌లో కూడా ఆడితే మళ్లీ నన్ను పిలుస్తారేమో.
రీఎంట్రీ ఇస్తా
అయితే, సౌతాఫ్రికాలో పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అందుకే టెస్టు సిరీస్‌కు నన్ను పిలుస్తారని ఆశించా. కానీ ఆ జట్టులో నాకు స్థానం దక్కలేదు. చాలా బాధగా అనిపించింది. అయినా.. ఇప్పుడు ఏం అనుకుని ఏం లాభం. అయితే, ఏదో ఒకరోజు తప్పకుండా మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాననే నమ్మకం ఉంది’’ అని అజింక్య రహానే ఉద్వేగానికి లోనయ్యాడు.
కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ రహానేను కొనుగోలు చేసింది. రూ. కోటి యాభై లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో టీమిండియా 3-1తో ఓడిపోయింది. తదుపరి టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనున్న రోహిత్ సేన ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ టోర్నీతో బిజీగా ఉంది.
చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ
Comments
Please login to add a commentAdd a comment