అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పట్లో వీడ్కోలు పలికే ఆలోచన తనకు లేదని ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాడు. తన బ్యాటింగ్ పవర్ ఇంకా తగ్గలేదని.. పొట్టి ఫార్మాట్‌లో రాణించగలననే విశ్వాసం వ్యక్తం చేశాడు.
పరుగుల వీరుడు
ఆస్ట్రేలియా తరఫున 2010లో అరంగేట్రం చేసిన స్మిత్.. ఇప్పటి వరకు 109 టెస్టులు, 158 వన్డేలు, 67 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 32 సెంచరీలు, 4 డబుల్ సెంచరీల సాయంతో 9685 పరుగులు చేసిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. వన్డేల్లో 12 శతకాలు బాది.. 5446 రన్స్ స్కోరు చేశాడు. అయితే, టీ20లలో మాత్రం స్మిత్ సగుటన 24.86తో కేవలం 1094 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
యువ ఆటగాళ్ల నుంచి పోటీ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆసీస్ టీ20 జట్టులో అరకొర అవకాశాలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. స్మిత్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, 35 ఏళ్ల స్మిత్ మాత్రం తన బ్యాటింగ్‌లో పస ఇంకా తగ్గలేదంటున్నాడు. బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంఛైజీ సిడ్నీ సిక్సర్‌తో ఇటీవలే మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్న ఈ సిడ్నీ క్రికెటర్... మరో నాలుగేళ్ల పాటు టీ20 క్రికెట్ ఆడగలనని తెలిపాడు.
ఒలింపిక్స్‌లోనూ భాగమైతే..
‘‘ప్రపంచంలోని ఫ్రాంఛైజీ క్రికెట్‌లో.. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే నేనే ఎక్కువ లీగ్‌లలో భాగమయ్యాను. మరో నాలుగేళ్ల పాటు టీ20 క్రికెట్ ఆడగల సత్తా నాకుంది. కాబట్టి.. రిటైర్‌మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం... ఆటకు వీడ్కోలు పలకాలనే ఆలోచనే లేదు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోనూ భాగమైతే ఇంకా బాగుంటుంది’’ అని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా పటిష్ట జట్టు
ఇక భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇండియా పటిష్టమైన జట్టు. ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోటీని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని స్మిత్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. రానున్న విశ్వ క్రీడల ఎడిషన్‌లో క్రికెట్‌ను తిరిగి ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్‌లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో భాగంగా పొట్టి ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment