Watch: Novak Djokovic Falls Over Net Bizarre Moment In Wimbledon Video Viral - Sakshi
Sakshi News home page

#NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు!

Published Tue, Jul 11 2023 7:52 AM | Last Updated on Tue, Jul 11 2023 9:41 AM

Novak Djokovic Falls Over Net-Bizarre Moment-In-Wimbledon Video Viral - Sakshi

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ దూసుకెళ్తున్నాడు. కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిలే లక్ష్యంగా సాగుతున్న జొకోవిచ్‌ వింబుల్డన్‌లో 14వ సారి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. 2021 సెమీఫైనలిస్ట్, ప్రపంచ 18వ ర్యాంకర్‌ హుబెర్ట్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ 7–6 (8/6), 7–6 (8/6), 5–7, 6–4తో నెగ్గి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.  

కాగా మ్యాచ్‌లో రెండో సెట్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హుర్కాజ్‌ సర్వీస్‌ చేసి డ్రాప్‌ షాట్‌ ఆడాడు. దీంతో బంతి జొకోవిచ్‌ నెట్‌ దగ్గర్లోనే పడేలా కనిపించింది. ఒక్క పాయింట్‌ కూడా వదలకూడదన్న ఉద్దేశంతో జొకోవిచ్‌ వేగంగా పరిగెత్తుకొచ్చి బాడీ బాగా స్ట్రెచ్‌ చేస్తూ షాట్‌ ఆడాడు. అయితే ఇదే సమయంలో బాడీ కంట్రోల్‌ కోల్పోయిన జొకోవిచ్‌ ఒక్కసారిగా నెట్‌పై పడిపోయాడు.

అదృష్టవశాత్తూ జొకోకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే జొకోవిచ్‌ చర్య తన ప్రత్యర్థి హుర్కాజ్‌తో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచింది. హుర్కాజ్‌ జొకోవిచ్‌ దగ్గరికి వెళ్లి అతన్ని పైకి లేపి జాగ్రత్త చెప్పి కాసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. కాగా జొకోవిచ్‌కు ఇది వింబుల్డన్‌లో వందో మ్యాచ్‌ కావడం విశేషం. కాగా మ్యాచ్‌ ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జరిగింది.

టోర్నీ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే ఆటను కొనసాగించాలి. ఆదివారం రెండు సెట్‌లు ముగిసిన తర్వాత మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు.సోమవారం ఆటను కొనసాగించగా... మూడో సెట్‌ను హుర్కాజ్‌ గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్‌లో జొకోవిచ్‌ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఏడో గేమ్‌లో హుర్కాజ్‌ సర్విస్‌ను బ్రేక్‌ చేసి ఎనిమిదో గేమ్‌లో తన సర్విస్‌ను కాపాడుకొని 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్‌లో జొకోవిచ్‌ తన సర్విస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం  చేసుకున్నాడు. వింబుల్డన్‌ టోర్నీ చరిత్రలో జొకోవిచ్‌కిది 90వ విజయం కావడం విశేషం. 

చదవండి: MS Dhoni Reaction To Fan: 'భయ్యా.. నొప్పి ఎలా ఉంది?'.. ధోని రియాక్షన్‌ వైరల్‌

#LakshyaSen: చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement