New Zealand vs Bangladesh, 1st T20I: న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. మూడో వన్డేలో కివీస్‌ను చిత్తు చేసి చరిత్ర సృష్టించి బంగ్లా... మొదటి టీ20లో సంచలన విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్‌లో తొలి టీ20 గెలుపు నమోదు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిపత్యాన్ని 2-1కు తగ్గిస్తూ ఆఖరి మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. గెలుపు జోష్‌లో టీ20 సిరీస్‌ను మొదలుపెట్టిన బంగ్లా.. నేపియర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
స్పిన్నర్ మెహదీ హసన్ రెండు, షోరిఫుల్ ఇస్లాం వరుస వికెట్లు తీసి.. కివీస్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టారు. టాపార్డర్‌ను కకావికలం చేశారు. వీరిద్దరి దెబ్బకు ఓపెనర్లు ఫిన్ అలెన్(1), సీఫర్ట్(0).. డారిల్ మిచెల్(14), గ్లెన్ ఫిలిప్స్(0) పూర్తిగా విఫలమై పెవిలియన్ చేరారు.
మిగిలిన వాళ్లలో జిమ్మీ నీషం 48, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 23 పరుగులతో రాణించగా.. నిర్నీత 20 ఓవర్లలో కివీస్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ 42 పరుగులు(నాటౌట్), నాలుగో నంబర్ బ్యాటర్ సౌమ్య సర్కార్ 22 పరుగులతో మెరుగ్గా ఆడారు.
వీరిద్దరి తోడు మెహదీ హసన్ 16 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది బంగ్లాదేశ్. తద్వారా న్యూజిలాండ్ గడ్డ మీద పొట్టి ఫార్మాట్లో తొలి విజయాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టీ20 జరుగనుంది.
చదవండి: #Virat kohli: విరాట్ కోహ్లికి ఘోర అవమానం! మండిపడుతున్న ఫ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment