అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీరుపై ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ విమర్శలు గుప్పించాడు. ఓవర్ రేటు విషయంలో తమకు అన్యాయం జరిగిందనే అర్థం స్ఫురించేలా సోషల్ మీడియా వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు.
ఆతిథ్య కివీస్ జట్టుపై గెలుపు
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ ఆతిథ్య కివీస్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.
పెనాల్టీ వేసిన ఐసీసీ
అయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదైందన్న కారణంగా ఐసీసీ ఇంగ్లండ్- న్యూజిలాండ్‌లకు పెనాల్టీ వేసింది. డబ్ల్యూటీసీ పాయింట్లలో మూడు పాయింట్ల మేర కోత పెట్టింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ స్పందిస్తూ.. ‘చాలా మంచిది ఐసీసీ... మరో పది గంటల ఆట మిగిలి ఉండగానే టెస్టు ముగిసింది’... అని సెటైర్ వేశాడు.
స్టోక్స్‌కు ఆగ్రహానికి కారణం?
ఇదిలా ఉంటే.. 2021–23 డబ్ల్యూటీసీ ఎడిషన్‌లోనూ ఇంగ్లండ్ ఇదే కారణంగా ఏకంగా 22 పాయింట్లు కోల్పోయింది. గత ఏడాది యాషెస్ సిరీస్ ఫలితం తర్వాత ఇంగ్లండ్ ఖాతాలో 28 పాయింట్లు చేరగా... పెనాల్టీ రూపంలోనే 19 పాయింట్లు పోయాయి! సహజంగానే ఇది స్టోక్స్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు ఓవర్ రేట్ శిక్షలు అనేవే అత్యంత గందరగోళంగా ఉన్నాయని అతడు అన్నాడు.
గతంలోనూ తాను ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని స్టోక్స్ గుర్తు చేశాడు. టెస్టు మ్యాచ్ నిర్ణీత సమయంకంటే చాలా ముందే ముగిసిపోయినా... ఓవర్ రేట్ శిక్షలు వేయడం ఏమిటని అతను ప్రశ్నించాడు. ‘రెండు జట్ల కోణంలో ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే టెస్టు మ్యాచ్ చాలా ముందుగానే ముగిసింది. మ్యాచ్‌లో ఫలితం కూడా వచ్చింది. అసలు ఏమాత్రం అవగాహన లేకుండా వేస్తున్న పెనాల్టీలు తీవ్ర అసహనం కలిగిస్తున్నాయి.
ఉపఖండంలో ఇలాంటి సమస్య రాదు
ప్రపంచంలో మనం ఎక్కడ క్రికెట్ ఆడుతున్నామనేది కూడా ముఖ్యం. ఉపఖండంలో జరిగే మ్యాచ్‌లలో ఎప్పుడూ ఈ సమస్య రాదు. ఎందుకంటే అక్కడ స్పిన్నర్లు ఎక్కువ ఓవర్లు బౌల్ చేస్తారు. మైదానంలో బౌలర్‌తో మళ్లీ మళ్లీ మాట్లాడటంతో పాటు ఓవర్ల తర్వాత ఫీల్డింగ్ మార్పులు, వ్యూహాల్లో మార్పులు వంటి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక కెప్టెన్‌గా నేను ఇదే పని చేస్తాను. ఇవన్నీ పట్టించుకోకుండా తొందరపెడితే ఎలా?.. మేం అక్కడ ఉన్నది మ్యాచ్ ఆడటానికి అనే విషయం మరచిపోవద్దు. చాలా మంది ఆటగాళ్లది ఇదే అభిప్రాయం. ఐసీసీ ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది.
ఐసీసీ నుంచి స్పందన రాలేదు
ఏడాది క్రితం కూడా నేను దీనిపై మాట్లాడాను. కానీ ఐసీసీ నుంచి స్పందన రాలేదు. అందుకే అప్పటి నుంచి ఓవర్ రేట్ పెనాల్టీ షీట్‌లపై సంతకం పెట్టలేదు. కానీ ఐసీసీ జరిమానా విధించి పాయింట్లతో కోత ఎలాగూ విధిస్తుంది’ అని స్టోక్స్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించాడు.
చదవండి: ‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’
Comments
Please login to add a commentAdd a comment