న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్‌లో టాప్ రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన కేన్.. తాజాగా మరిన్ని రికార్డులు నమోదు చేశాడు.
ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు (118, 109) చేసిన కేన్.. ఈ ఘనత (ట్విన్ సెంచరీలు) సాధించిన ఐదో న్యూజిలాండ్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
సెకెండ్ ఇన్నింగ్స్ సెంచరీతో టెస్ట్ సెంచరీల సంఖ్యను 31కి పెంచుకున్న కేన్.. అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో కలిపి 44 సెంచరీలు) చేసిన యాక్టివ్ ప్లేయర్స్ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు.
ఈ జాబితాలో విరాట్ కోహ్లి (80 సెంచరీలు) టాప్‌లో ఉండగా.. డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. కేన్ (44).. స్మిత్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు.
తాజా సెంచరీతో కేన్ మరో రికార్డు కూడా సాధించాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 31 సెంచరీలు (170 ఇన్నింగ్స్‌ల్లో) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో (165 ఇన్నింగ్స్‌ల్లో) ఉండగా.. స్టీవ్ స్మిత్, విలియమ్సన్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. కేన్ గత 10 ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు ఇలా ఉన్నాయి. 132, 1, 121*, 215, 104, 11, 13, 11, 118, 109.
ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
కాగా, మౌంట్ మాంగనూయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌లో న్యూజిలాండ్ గెలుపు దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 528 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మహా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధి సౌతాఫ్రికా గెలవలేదు.
కేన్ ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి న్యూజిలాండ్ గెలుపుకు పునాది వేయగా.. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (240) చేసి తనవంతు పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 511 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. భారీ లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న కివీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment