తదుపరి జరుగబోయే వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన వేదికలు ఖరారైయ్యాయి. 2027 అక్టోబర్, నవంబర్‌లలో షెడ్యూలైన ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రస్తుతానికి సౌతాఫ్రికాలో జరుగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు ఖరారైయ్యాయి. సౌతాఫ్రికాలో ఐసీసీ గుర్తింపు పొందిన మైదానాలు మొత్తం 11 ఉండగా.. వాటిలో ఎనిమిదింట వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
వాండరర్స్, ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్, కింగ్స్‌మీడ్, గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, పార్ల్ అండ్ న్యూలాండ్స్‌లోని బోలాండ్ పార్క్, బ్లూమ్‌ఫోంటెయిన్‌లోని మాంగాంగ్ ఓవల్, తూర్పు లండన్‌లోని బఫెలో పార్క్ మైదానాలు 2027 క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. బెనోని, జేబీ మార్క్స్ ఓవల్, డైమండ్ ఓవల్ మైదానాల్లో వసతులు సక్రమంగా లేనందుకు వాటిని పక్కకు పెట్టారు.
చాలా అంశాలను (హోటల్స్, ఎయిర్‌పోర్ట్‌లు, స్టేడియం కెపాసిటీ తదితర అంశాలు) పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ ఎనిమిది వేదికలను వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫోలెట్సీ మోసెకీ తెలిపారు. జింబాబ్వే నమీబియాలో జరుగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు త్వరలోనే ఖరారుకానున్నాయి.
కాగా, 2027 వరల్డ్‌కప్‌కు ఆతిథ్య దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించగా.. నమీబియా ఆఫ్రికన్ క్వాలిఫైయర్‌ను అధిగమిస్తే అర్హత సాధిస్తుంది. ఈ మెగా టోర్నీకి వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉండే జట్లు నేరుగా అర్హత పొందనుండగా.. మిగిలిన నాలుగు స్థానాలు గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌ల ద్వారా నిర్ణయించబడతాయి.
ఈ టోర్నీలో పాల్గొనే 14 జట్లు గ్రూప్‌కు ఏడు చొప్పున రెండు గ్రూపులు విభజించబడతాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. అనంతరం సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. 2003 వరల్డ్‌కప్ తరహాలోనే ఈ ప్రపంచకప్‌లోనూ గ్రూప్ దశలో జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment