Vinesh Phogat: అలా అయితే రజతం వచ్చే అవకాశం! | Olympics: CAS To Give Verdict on Vinesh Phogat Appeal She Hopes Joint Silver | Sakshi
Sakshi News home page

Vinesh Phogat: అలా అయితే రజతం వచ్చే అవకాశం!

Published Thu, Aug 8 2024 7:36 PM | Last Updated on Thu, Aug 8 2024 7:48 PM

Olympics: CAS To Give Verdict on Vinesh Phogat Appeal She Hopes Joint Silver

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌కు ఊరట లభించింది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024 రజత పతకం కోసం వినేశ్‌ వేసిన పిటిషన్‌ను స్పోర్ట్స్ కోర్టు స్వీకరించింది. ఇందుకు సంబంధించి గురువారం విచారణ చేపట్టింది. కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. కాగా మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్‌  స్వర్ణ–రజత పతక బరిలో 100 గ్రాముల అధిక బరువు తేడాతో అనూహ్యంగా అనర్హతకు గురైన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అప్పీలుకు వెళ్లిన విషయం తెలిసిందే. 

కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్‌)లో తన అనర్హతను సవాలు చేస్తూ రజత పతకం కోసం అప్పీలు చేసింది. ఒకవేళ సీఏఎస్‌లో వినేశ్‌కు అనుకూలంగా తీర్పు వస్తే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వినేశ్‌కు సంయుక్తంగా రజత పతకం బహూకరించే అవకాశముంది.  

కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్‌) విధులు ఏమిటి?
కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ను 1983లో స్థాపించారు. క్రీడలకు సంబంధించి తలెత్తిన వివాదాలను ఈ కోర్టు పరిష్కరిస్తుంది. 1993లో ఇది పూర్తి స్వతంత్ర సంస్థగా మారింది. ప్యారిస్‌ ఒప్పందం ద్వారా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ, అసోసియేషన్‌ ఆఫ్‌ సమ్మర్‌ ఒలింపిక్‌ ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్స్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీల గుర్తింపు పొందింది. నాటి ఫ్రెంచి న్యాయశాఖ మంత్రి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

ఇక ఒలింపిక్స్‌-2024 నేపథ్యంలో ప్యారిస్‌లో రెండు తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసింది. అందులో ఒకటి సీఏఎస్‌ అడ్‌ హక్‌ డివిజన్‌. క్రీడలు జరుగుతున్న సమయంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత అడ్‌ హక్‌ డివిజన్‌పై ఉంటుంది. సమ్మర్‌, వింటర్‌ ఒలింపిక్స్‌ ప్రతీ సీజన్‌లో ఈ తాత్కాలిక ట్రిబ్యునల్‌ అప్పీళ్లను స్వీకరిస్తుంది.

 1996 నుంచి ఈ విధానం కొనసాగుతోంది. ఆటగాళ్ల ఫిర్యాదును స్వీకరిస్తే.. 24 గంటల్లోపే తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. అయితే, పరిస్థితి తీవ్రత దృష్ట్యా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తీర్పు వెలువరించేందుకు ఇంకాస్త ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు.

సీఏఎస్‌ అడ్‌ హక్‌ డివిజన్‌ ప్రస్తుత ప్రెసిడెంట్- మైఖేల్‌ లెనార్డ్‌(యూఎస్‌ఏ), కో- ప్రెసిడెంట్స్‌- డాక్టర్‌ ఎలిజబెత్‌ స్టీనర్‌(ఆస్ట్రియా), కరోల్‌ మలిన్వాద్‌(ఫ్రాన్స్‌) పదవుల్లో ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement