ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు నేపథ్యంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు కీలకంగా మారింది. తనకు అన్యాయం జరిగిందంటూ వినేశ్ వేసిన పిటిషన్‌ను సీఏఎస్ శుక్రవారం విచారించనుంది. నిజానికి.. వినేశ్ అనర్హత, పతకం నిరాకరణపై సీఏఎస్‌లోని అడ్‌హక్ కమిటీ గురువారం రాత్రే విచారించాల్సింది.
ఇందుకోసం నలుగురు లాయర్లతో కూడిన బృందాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఏర్పాటు చేసుకుంది. అయితే బలమైన వాదన, పూర్తిస్థాయి సన్నద్ధత కోసం నిష్ణాతులైన లాయర్లతో అప్పీలును గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఐఓఏ ఒకరోజు గడువు కోరింది. దీన్ని మన్నించిన సీఏఎస్ శుక్రవారం మధ్యాహ్నానికి విచారణను వాయిదా వేసినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో భారత ఒలింపిక్ సంఘం వినేశ్ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రఖ్యాత న్యాయవాది హరీశ్ సాల్వేను నియమించుకున్నట్లు తెలుస్తోంది. భారత మాజీ సాలిసిటర్ జనరల్ అయిన హరీశ్ సాల్వేకు ఘనమైన రికార్డు ఉంది. భారత్‌లోని టాప్ లాయర్లలో ఒకరిగా పేరుగాంచిన ఆయన.. 1999- 2002 వరకు సాలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.
కుల్‌భూషణ్ జాదవ్ కేసు(2017) విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తరఫున వాదనలు వినిపించిన హరీశ్ సాల్వే.. పాకిస్తాన్‌లో కుల్‌భూషణ్‌కు మరణశిక్ష పడకుండా తప్పించగలిగారు.
అదే విధంగా.. రతన్ టాటా వర్సెస్ సైరస్ మిస్త్రీ(2016)లో రతన్ టాటా తరఫున వాదించి ఆయనకు గెలుపును బహుమతిగా ఇచ్చారు. 2012 నాటి 2G స్పెక్ట్రమ్ కేసులోనూ సాల్వే జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున వకాల్తా పుచ్చుకుని.. వాదనలు వినిపించారు. ఇలాంటి ప్రముఖ కేసులెన్నో వాదించిన హరీశ్ సాల్వే.. వినేశ్ ఫొగట్ తరఫున రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.
కాగా వినేశ్ ఫొగట్ తన అనర్హతను సవాలు చేస్తూ రజత పతకం కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో అప్పీలు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ సీఏఎస్‌లో వినేశ్‌కు అనుకూలంగా తీర్పు వస్తే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వినేశ్‌కు సంయుక్తంగా రజత పతకం బహూకరించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment