గాలే వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టులో ఇండియా-ఏ జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 48/0తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా-ఏ జట్టు 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన దేవదత్ పడిక్కల్ (67) అర్ధసెంచరీ సాధించాడు.
ఓపెనర్ ఆయుష్ పాండే 38 పరుగులు చేసి దులజ్ సముదితా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అంతకముందు సాయి సుదర్శన్ (7) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ 172 పరుగుల ఆధిక్యం కలుపుకొని 271 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. టీ సెషన్ వరకు వీలైనంత ఎక్కువ పరుగులు చేసి లంక-ఏ ముంగిట 400కు పైగా లక్ష్యాన్ని ఉంచాలని ఇండియా-ఏ భావిస్తోంది.
అంతకముందు శ్రీలంక-ఏ తమ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. నువానిదు ఫెర్నాండో (84), ఆషెన్ బండారా (70), కెప్టెన్ సహన్ అరాచిగె (72) అర్ధశతకాలతో రాణించారు. ఇండియా-ఏ బౌలర్లలో అకిబ్ నబీ 4 వికెట్లతో చెలరేగగా, యష్ ఠాకూర్, హర్ష్ దూబే చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ జట్టు 452 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ధ్రువ్ జురేల్‌తో పాటు ఓపెనర్ సాయి సుదర్శన్ భారీ శతకాలతో మెరిశారు.


