Photo Credit: BCCI Twitter
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆగస్టు 5న లంక గడ్డపై అడుగుపెట్టింది. ఆగస్టు 7 నుంచి మూడు రోజుల పాటు కొలంబో వేదికగా లంక ఎలెవెన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడిన టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. వార్మప్ మ్యాచ్ ఇచ్చిన విజయం జోష్‌తో టీమిండియా తొలి టెస్టు ఆడేందుకు గాలేలో అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా గాలే ఎయిర్‌పోర్టు నుంచి టీమిండియా ఆటగాళ్లు బయటికి వస్తున్న ఫొటోలను బీసీసీఐ బుధవారం ఎక్స్ వేదికగా పంచుకుంది. జడేజా, పంత్, జైస్వాల్, సిరాజ్, సర్ఫరాజ్ ఖాన్ సహా ఇతర ఆటగాళ్లు, కోచ్ గంభీర్ కనిపించారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో గాలే స్టేడియం సమీపంలోని హోటల్‌కు చేరుకున్నారు. బుధవారం విశ్రాంతి తీసుకోనున్న గిల్ సేన గురువారం ప్రాక్టీస్ చేయనుంది. శనివారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.
దంచికొట్టిన వాన..
అయితే గాలేలో వాతావరణం రెండు రోజుల నుంచి చల్లగానే ఉంది. సోమవారం నుంచి మేఘావృతమై ఉన్న గాలేలో మంగళవారం వాన దంచికొట్టింది. రాబోయే రెండు, మూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు లేకపోలేదు.
ఇక ఈ టెస్టు సిరీస్ రెండు జట్లకు కీలకమే. 2027లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌లో విజయం తప్పనిసరి. ఒక్క మ్యాచ్ రద్దయినా అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.
కోహ్లి కెప్టెన్సీలో ఘన విజయం
గాలేలో గతంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. 2017లో కోహ్లి కెప్టెన్సీలో గాలే వేదికగా శ్రీలంకతో ఆడిన టెస్టులో ఇన్నింగ్స్ 304 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 600 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (190), పుజారా (153) సెంచరీలతో చెలరేగారు.
లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీ, అభినవ్ ముకుంద్ 81 పరుగులు చేయడంతో టీమిండియా 241 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో లంక ముంగిట 550 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచగా, భారత బౌలర్ల ధాటికి లంక 245 పరుగులకే కుప్పకూలింది. దీంతో గాలే టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
జడేజా ఒక్కడే..
కాగా అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్న జడేజాకు మాత్రమే గాలేలో ఆడిన అనుభవముంది. పడిక్కల్, గుర్నూర్ బ్రార్, సారాంశ్ జైన్, అకిబ్ నబీలు ఇటీవలే ఇదే గాలే వేదికగా లంక-ఏ జట్టుతో అనధికారిక టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టు శనివారం నుంచి జరగనుండగా, రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనుంది.
Colombo 🚌 Galle#TeamIndia have arrived for the #SLvIND Test series opener 🙌 pic.twitter.com/UXoo0gTzCv
— BCCI (@BCCI) August 12, 2026


