‘బాయ్‌కాట్‌ విషయమే తెలీదు.. అప్పుడు భోజనం చేస్తున్నాం’ | PAK-Coach Sarfaraz Ahmed-Says-Knows-Nothing-PCB Boycott-Lords Test | Sakshi
Sakshi News home page

‘బాయ్‌కాట్‌ విషయమే తెలీదు.. అప్పుడు భోజనం చేస్తున్నాం’

Aug 29 2026 4:09 PM | Updated on Aug 29 2026 6:42 PM

PAK-Coach Sarfaraz Ahmed-Says-Knows-Nothing-PCB Boycott-Lords Test

Photo Credit: Twitter

పాకిస్తాన్ క్రికెట్ దిగ్గ‌జం, మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుల‌ను స్కై స్పోర్ట్స్ ఇంట‌ర్య్వూ చేయ‌డాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా వ్య‌తిరేకించింది. దీనిని నిర‌సిస్తూ లార్డ్స్ టెస్టును బ‌హిష్క‌రిస్తామ‌ని పీసీబీ పేర్కొన్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ వివాదంపై పాకిస్తాన్ హెడ్ కోచ్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ స్పందించాడు. ఈ  విష‌యాలేవీ త‌మకు తెలియ‌ద‌ని, ఆట‌పై మాత్ర‌మే దృష్టి పెట్టామ‌ని, ఆ స‌మ‌యంలో తాము భోజ‌నం చేస్తున్నామ‌ని చెప్ప‌డం ఆస‌క్తి క‌లిగించింది.

అస‌లు వివాదం ఎక్క‌డ మొద‌లైందంటే.. లార్డ్స్ టెస్ట్ సంద‌ర్భంగా తొలి రోజు ఆట స‌మ‌యంలో మాజీ ఇంగ్లండ్‌ కెప్టెన్ మైక్ అథర్టన్, ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిమ్, సులేమాన్‌ల‌ను ఇంటర్వ్యూ చేశాడు. జైలులో ఉన్న తమ తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందని, కంటిచూపు కూడా తగ్గుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

కానీ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, పాక్ ప్రభుత్వంలో హోం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఈ ఇంటర్వ్యూపై పాక్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్వ్యూను ఆపకపోతే మధ్యాహ్నం సెషన్ నుంచి ఆట‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఇంగ్లండ్‌ బోర్డు (ఈసీబీ) యూకే ప్రభుత్వ సలహా తీసుకుని, కొద్దిసేపటి విరామం తర్వాత లంచ్ సమయంలో ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. 

పాకిస్తాన్‌లో మాత్రం ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంట‌ర్వ్యూ ప్రసారాన్ని నిలిపివేశారు. అయితే పీసీబీ బెదిరింపులు ఎలా ఉన్న‌ప్ప‌టికీ, పాక్ ప్లేయర్స్ మాత్రం తొలిరోజు లంచ్ తర్వాత యథావిధిగా మైదానంలో అడుగుపెట్టారు. అయితే మ్యాచ్ బ‌హిష్క‌రిస్తామ‌ని పీసీబీ హెచ్చరించిందనే వార్తలను సర్ఫరాజ్ అహ్మ‌ద్‌ తోసిపుచ్చాడు. 

పీసీబీ నిరసనపై తమకు లేదా తమ ఆటగాళ్లకు ఎలాంటి సమాచారం లేదని, ఆ సమయంలో తామంతా లంచ్ చేస్తున్నామని వివ‌ర‌ణ ఇచ్చాడు. తాము ఇలాంటి వివాదాల‌పై ఎప్పుడు దృష్టి సారించ‌బోమ‌ని, కేవ‌లం ఆట‌పైనే త‌మ ఫోక‌స్ ఉంటుంద‌ని స‌ర్ఫ‌రాజ్ వెల్ల‌డించాడు.

ఇంగ్లండ్‌, పాకిస్తాన్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టుకు వ‌రుణుడు ఆటంకం క‌లిగించడంతో మూడోరోజు ఆట మొదలుకాలేదు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, అనంత‌రం పాకిస్తాన్ 110 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 22 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 81 ప‌రుగులు చేసింది. ఎమియో గే (30), హారీ బ్రూక్ (7) క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ 261 ప‌రుగుల భారీ ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

చదవండి: ‘ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.. బలమైన ఆధారాలున్నాయి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement