ICC Cricket World Cup 2023, 2nd Match- - Pakistan vs Netherlands: వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఫాస్ట్‌బౌలర్ బాస్ డి లిడే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 9 ఓవర్ల బౌలింగ్‌లో 62 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. పాక్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్‌తో కలిసి 68 పరుగులతో సంయుక్తంగా టాప్ స్కోరర్‌గా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ రూపంలో లిడేకు తొలి వికెట్ దక్కింది.
అదే ఓవర్లో(32) ఇఫిక్తర్ అహ్మద్(9) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు బాస్ డి లిడే. ఆ తర్వాత షాదాబ్ ఖాన్(32), హసన్ అలీ(0) వికెట్లు కూడా పడగొట్టాడు. దీంతో అతడి ఖాతాలో నాలుగు వికెట్లు చేరాయి.
తండ్రి అడుగుజాడల్లో
ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో తండ్రి అడుగుజాడల్లో నడిచిన కొడుకుగా బాస్ డి లిడే గుర్తింపు సాధించాడు. నెదర్లాండ్స్ తరఫున ప్రపంచకప్ ఈవెంట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాకాలు సాధించిన నాలుగో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 2003 వరల్డ్‌కప్‌లో బాస్ తండ్రి.. టిమ్ డి లిడె టీమిండియాతో పర్ల్ మ్యాచ్‌లో 4/35 నమోదు చేశాడు.
(PC: Voorburg Cricket Club)
వన్డే ప్రపంచకప్ చరిత్రలో
అదే ప్రపంచకప్ టోర్నీలో టిమ్ డి లిడేతో పాటు ఫీకో క్లాపెన్‌బర్గ్ నమీబియాపై 4/42, ఆదిల్ రాజా నమీబియాపైనే 4/42 గణాంకాలు నమెదు చేశారు. ఇక తాజాగా భారత్ వేదికగా హైదరాబాద్‌లో బాస్ డి లిడే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 4/62 బౌలింగ్ ఫిగర్స్‌తో ఈ జాబితాలో చేరిపోయాడు. కాగా ఈ ఎలైట్ లిస్టులో చోటు సంపాదించిన తండ్రీ కొడుకులుగా( నెదర్లాండ్స్ తరఫున) అరుదైన రికార్డు సృష్టించారు టిమ్, బాస్.
286 పరుగులకు పాక్ ఆలౌట్
ఇక ఉప్పల్ వేదికగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. డచ్ బౌలర్లలో అకెర్మాన్ రెండు, వాన్ మెకెరిన్, వాన్‌బీక్, ఆర్యన్ దత్ ఒక్కో వికెట్ తీయగా.. లిడేకు నాలుగు వికెట్లు దక్కిన విషయం తెలిసిందే.
నాడు సచిన్ వికెట్ తీసి
కాగా తండ్రి టిమ్ డి లిడే మాదిరే బాస్ డి లిడే సైతం బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఇక టిమ్ 2003 వరల్డ్‌కప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ బ్యాటర్లతో పాటు హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వికెట్లు తీశాడు. నాటి.. లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టిమ్.. హర్భజన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం.
చదవండి: Asian Games: జపాన్‌ను చిత్తు చేసి.. పసిడి గెలిచి! ప్యారిస్ ఒలంపిక్స్ బెర్తు ఖరారు
Comments
Please login to add a commentAdd a comment