Asia Cup 2023- Pakistan Vs Sri Lanka: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు. కీలక ఆటగాడిపై వేటు వేసినందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ గెలవడం మాట అటుంచితే.. ఫైనల్ చేరడమే కష్టమని.. ఇక ఇంటికి వచ్చేందుకు సిద్ధం కావాలంటూ పాక్ జట్టును ఉద్దేశించి ఘాటు విమర్శలు చేస్తున్నారు.
టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఈ దుస్థితిలో
కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. శ్రీలంకతో చావోరేవో తేల్చుకోనుంది. కొలంబో వేదికగా గురువారం నాటి ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు భారత్‌తో పాటు ఫైనల్‌కు చేరుకుంటుంది.
గాయాల కారణంగా కీలక పేసర్లు అవుట్
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న శ్రీలంక తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్‌ను ఓ వైపు గాయాల బెడద వెంటాడుతుంటే.. మరోవైపు.. ఓపెనర్ ఫఖర్ జమాన్‌ను తప్పిస్తూ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. లంకతో మ్యాచ్‌కు ముందు పాక్ బుధవారమే తమ తుది జట్టును ప్రకటించింది.
లంకతో మ్యాచ్‌లో ఏకంగా ఐదు మార్పులు
స్టార్ పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్, ఆఘా సల్మాన్ గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. వారి స్థానాల్లో జమాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన ఫహీం ఆష్రఫ్‌పై వేటు పడగా.. మహ్మద్ నవాజ్ జట్టులోకి వచ్చాడు. అయితే, వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ స్థానంలో మహ్మద్ హ్యారిస్‌ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
వరుస వైఫల్యాల నేపథ్యంలో వేటు!
ఇప్పటి వరకు ఈ వన్డే టోర్నీలో మొత్తంగా ఆడిన మూడు ఇన్నింగ్స్‌లో ఫఖర్ జమాన్ కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో 50 బంతులు ఆడి కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, పాక్ ఇన్నింగ్స్‌లో అతడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం.
ఈ క్రమంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో కీలక మ్యాచ్‌లో ఫఖర్ జమాన్‌పై వేటు పడింది. అయితే, డూ ఆర్ డై మ్యాచ్‌లో అతడిని తప్పించడం జట్టుకు మైనస్‌గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వరుస సెంచరీలు.. ద్విశతక వీరుడు
తనదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న అనుభవం ఉన్న ఆటగాడిని కాదని హ్యారిస్‌ను ఆడించడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఫఖర్ జమాన్ వరుస సెంచరీలు సాధించాడు.
రెస్ట్ పేరిట వేటు?
జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న ఫఖర్ జమాన్‌కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చిన మేనేజ్‌మెంట్ ఓపిక నశించి ఈసారి రెస్ట్ పేరిట వేటు వేసినట్లు తెలుస్తోంది.
హ్యారిస్ రికార్డు గణాంకాలేమో ఇలా
ఇక ఇప్పటి వరకు పాక్ తరఫున 76 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3268 పరుగులు సాధించాడు. ఫఖర్ జమాన్ ఖాతాలో 10 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉంది. పాక్ తరఫున వన్డేల్లో ద్విశతకం సాధించిన తొలి బ్యాటర్ అతడే!
ఇదిలా ఉంటే.. ఫఖర్ జమాన్ స్థానంలో తుదిజట్టులో వచ్చిన మహ్మద్ హ్యారిస్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆడిన 5 వన్డేల్లో కలిపి 27 పరుగులు సాధించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఇదిలా ఉంటే.. గందరగోళ పరిస్థితుల్లో లంక చేతిలో పాకిస్తాన్ చిత్తు కావడం ఖాయమంటూ టీమిండియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా!
Comments
Please login to add a commentAdd a comment