టీ20 ప్రపంచకప్-2024లో జట్టు వైఫల్యం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. సెలక్టర్ పదవి నుంచి అబ్దుల్ రజాక్‌ను కూడా తప్పించినట్లు సమాచారం.
కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్‌లో జరిగిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో భాగమైన బాబర్ ఆజం బృందం లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.
కనీసం సూపర్-8 కూడా చేరకుండానే
పసికూన అమెరికా, పటిష్ట భారత్ చేతిలో ఓడి కనీసం సూపర్-8 కూడా చేరకుండానే నిష్క్రమించింది. గత ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్ ఈసారి ఘోరంగా ఇలా వెనుదిరగడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజంను సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ నిర్ణయానికే పీసీబీ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.
అయితే, సెలక్షన్ కమిటీ విషయంలో మాత్రం ఈ మేరకు తామే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వహాబ్ రియాజ్, అబ్దుల్ రజాక్‌లను తప్పించాలని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదేశించినట్లు తెలుస్తోంది.
వీరిద్దరిని మినహాయిస్తే సెలక్షన్ కమిటీలో ఇంకో ఐదుగురు మిగులుతారు. హెడ్ కోచ్, కెప్టెన్(సంబంధిత ఫార్మాట్), మహ్మద్ యూసఫ్, అసద్ షఫీక్, బిలాల్ అఫ్జల్, డేటా అనలిస్టు ఉంటారు. ఇక రియాజ్, రజాక్ స్థానాలను ఇప్పట్లో భర్తీ చేసేందుకు పీసీబీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
రజాక్‌కు డబుల్ షాక్
అంతేకాదు రజాక్‌కు డబుల్ షాకిచ్చిన్నట్లు సమాచారం. మహిళా సెలక్షన్ కమిటీ విధుల నుంచి కూడా అతడిని తప్పించినట్లు తెలుస్తోంది. కాగా అనాలోచిత నిర్ణయాలు, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు, ఆజం ఖాన్(మాజీ కెప్టెన్ మొయిన్ కుమారుడు) వంటి ఆటగాళ్ల ఎంపిక నేపథ్యంలో వహాబ్ రియాజ్‌పై విమర్శలు వచ్చాయి.
అతడి విషయంలో మాజీ క్రికెటర్లు పీసీబీ తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు జట్టు వెళ్లిన సమయంలో రియాజ్ కేవలం సీనియర్ టీమ్ మేనేజర్‌గా మాత్రమే వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా అతడిని సెలక్షన్ కమిటీ నుంచి పూర్తిగా తప్పించినట్లు సమాచారం.
ఈ మేరకు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో కథనం వెలువరించింది. కాగా పాక్ బోర్డులో గత కొన్నేళ్లుగా నిలకడ లేకుండా పోయింది. గడిచిన నాలుగేళ్లలో ఆరుగురు చీఫ్ సెలక్టర్లు మారారు. హరూన్ రషీద్, షాహిద్ ఆఫ్రిది, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ వసీం, మిస్బా ఉల్ హక్, వహాబ్ రియాజ్ ఈ హోదాలో పనిచేశారు.
చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ!
Comments
Please login to add a commentAdd a comment