IND VS PAK T20 World Cup 2021.. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు మజానే. అందునా ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పటివరకు జరిగిన ఐసీసీ మేజర్ టోర్నీల్లో టీమిండియాదే ఆధిపత్యం. అయితే 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం టీమిండియాకు తొలిసారి పాక్ చేతిలో పరాభవం ఎదురైంది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అయితే 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా యూఏఈ వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను(అక్టోబర్ 24న) ఎదుర్కోనుంది. మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా పాక్‌పై విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించాలని ఉవ్విళ్లూరుతుంది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్ 2017
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి మ్యాచ్‌లో విజయం మాదేనని.. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను పునరావృతం చేయనున్నామని ధీమా వ్యక్తం చేశాడు. ''2017లో భారత్‌ని ఓడించి మేం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అదే స్ఫూర్తితో టీ20 ప్రపంచకప్‌లో కూడా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచులపై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. సాధారణంగా క్రికెట్ మ్యాచులు చూడని అభిమానులు కూడా ఈ పోరుపై ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి, భారత్‌తో తలపడటం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఆటగాళ్లపై కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. అయినా, మెరుగ్గా రాణించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఫఖర్ జమన్(114 పరుగులు)- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్ 2017
ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ విషయానికి వస్తే.. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ ఫఖర్ జమన్ సెంచరీతో(114 పరుగులు) మెరవగా.. మరో ఓపెనర్ అజహర్ అలీ 59 పరుగులు చేశాడు. చివర్లో మహ్మద్ హఫీజ్ 57 పరుగులతో రాణించాడు. అనంతరం 339 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పాక్ బౌలర్ల దాటికి 158 పరుగులకే కుప్పకూలి 180 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. హార్దిక్ పాండ్యా (43 బంతుల్లో 76 పరుగులు, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు.
హార్దిక్ పాండ్యా(76 పరుగులు)- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్ 2017
Comments
Please login to add a commentAdd a comment