విండీస్‌పై పాక్ విజ‌యం.. డ‌బ్ల్యూటీసీ లెక్క‌లు తారుమారు! | Pakistan Rise In WTC Standings After 8-Wicket Win Over West Indies In 2nd Test, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

విండీస్‌పై పాక్ విజ‌యం.. డ‌బ్ల్యూటీసీ లెక్క‌లు తారుమారు!

Aug 6 2026 8:33 AM | Updated on Aug 6 2026 10:47 AM

Pakistan Risen-Spot-In-WTC Points Table-Thrash-West-Indies-2nd Test

Photo Credit: Twitter

వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. అయితే డ‌బ్ల్యూటీసీ పాయింట్ల విష‌యంలో విండీస్‌పై విజ‌యం పాకిస్తాన్‌కు కాస్త ఉప‌శ‌మ‌న‌మిచ్చింది. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌రంగా మార్పు లేన‌ప్ప‌టికీ పాకిస్తాన్ ఒక స్థానం ఎగబాకి 8వ స్థానానికి చేరుకోగా, విండీస్ 9వ స్థానంలో కొన‌సాగుతోంది. 

ప్ర‌స్తుతం పాక్ ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజ‌యాలు సాధించి 22.22 ప‌ర్సంటేజ్ పాయింట్లు (పీసీటీ) క‌లిగి ఉంది. ఇక డ‌బ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక‌లో ఆస్ట్రేలియా 87.50 పీసీటీతో టాప్ స్థానంలో కొన‌సాగుతోంది. ఆసీస్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏడు విజ‌యాలు అందుకుంది. ఇక ఆ త‌ర్వాత సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వ‌రుస‌గా 75, 72.22 పీసీటీతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 

వీరి త‌ర్వాత బంగ్లాదేశ్ 58.33 పీసీటీతో నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది. బంగ్లాదేశ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజ‌యాలు, ఒక ఓట‌మి, ఒక డ్రా న‌మోదు చేసింది. టీమిండియా 48.15 పీసీటీతో ఐదో స్థానంలో కొన‌సాగుతుంది. అయితే శ్రీలంక‌తో రెండు మ్యాచ్‌ల‌ టెస్టు సిరీస్ ఉన్న నేప‌థ్యంలో సిరీస్‌ను భార‌త్ క్లీన్‌స్వీప్ చేస్తే పాయింట్ల ప‌రంగా భార‌త్ టాప్‌-3కి దూసుకెళ్లే అవ‌కాశ‌ముంది. 

ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ 9 మ్యాచ్‌ల్లో నాలుగు విజ‌యాలు, నాలుగు ఓట‌ములు, ఒక డ్రా చేసుకుంది. ఆ త‌ర్వాత శ్రీలంక (41.67), ఇంగ్లండ్ (24.36) ప‌ర్సంటేజ్ పాయింట్ల‌తో ఆరు, ఏడు స్థానాల్లో  కొన‌సాగుతున్నాయి. 2027లో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుండ‌డంతో టీమిండియా మూడోసారి ఫైన‌ల్‌కు చేరుకుంటుందా లేదా అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ గెలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 103/6తో బుధవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌ చివరకు 46.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కవెమ్‌ హెడ్జ్‌ (71 బంతుల్లో 34; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... తేజ్‌నారాయన్‌ చందర్‌పాల్‌ (17), అమిర్‌ జంగూ (13), కెప్టెన్‌ రోస్టన్‌ చేజ్‌ (17), షై హోప్‌ (15), సీల్స్‌ (0), గ్రీవ్స్‌ (3) విఫలమయ్యారు.

పాక్‌ బౌలర్లలో అలీ ఉస్మాన్, సాజిద్‌ ఖాన్‌ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం 75 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ 23.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి గెలుపొందింది. అజాన్‌ అవైస్‌ (18), ఇమాముల్‌ హక్‌ (9) ఎక్కువసేపు నిలవలేకపోగా... తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో అబ్దుల్లా షఫీఖ్‌ (24 నాటౌట్‌), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (24 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేయగా... పాకిస్తాన్‌ జట్టు 387 పరుగులు చేసింది. 2023 తర్వాత విదేశాల్లో పాకిస్తాన్‌కిదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం.

 

చదవండి: లైవ్ మ్యాచ్‌.. హఠాత్తుగా పిడుగు; ఫుట్‌బాల‌ర్‌ మృత్యువాత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement