ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంత వరకు తమ జట్టును ప్రకటించలేదు. ప్రాథమిక జట్ల ప్రకటనకు సంబంధించి జనవరి 12నే డెడ్‌లైన్ ముగిసినా పీసీబీ మాత్రం ఇంకా ఆలస్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రకటన విషయంలో పీసీబీ జాప్యం చేయడానికి గల కారణాలను విశ్లేషించాడు.
పాకిస్తాన్ భయపడుతోందా?
ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘జట్టును ప్రకటించేందుకు పాకిస్తాన్ భయపడుతోందా?.. కానే కాదు.. అయితే, ఏం చేయాలి? ఏం చేయకూడదు అన్న విషయాలపై మాత్రం పీసీబీకి ఇంకా స్పష్టత రానట్టుంది.
అతడి వల్లే జట్టు ప్రకటన ఆలస్యం!
ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. సయీమ్ ఆయుబ్. అతడు ఫిట్‌నెస్ సాధిస్తాడా? లేదా అన్నది ఇంకా తేలలేదు. అందుకే ఈ ఆలస్యం’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.
కాగా ఇటీవలికాలంలో అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపుతూ.. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్(Saim Ayub) గాయపడిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా అతడు చీలమండ నొప్పితో విలవిల్లాడాడు. ఇప్పటి దాకా అతడు పూర్తిగా కోలుకోలేదని సమాచారం.
ప్రస్తుతం పాకిస్తాన్ వన్డే జట్టులో సయీమ్ ఆయుబ్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. పాక్ తరఫున 2023లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 22 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 2024లో వన్డే, టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు.
మూడు శతకాలు
ఇప్పటి వరకు 27 టీ20లలో 498 పరుగులు చేసిన ఆయుబ్.. ఏడు టెస్టుల్లో 364 రన్స్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీశాడు. ఇక వన్డే ఫార్మాట్లో మాత్రం ఇటీవల అతడు అదరగొట్టాడు. తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 515 పరుగులు సాధించాడు.
ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఖాతాలో ఇప్పటికే మూడు శతకాలు ఉండటం విశేషం. ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకోవడంతో పాటు... సౌతాఫ్రికాలో ఏకంగా రెండు సెంచరీలు చేయడం అతడి సూపర్ ఫామ్‌కు నిదర్శనం.
అలాంటి ఆటగాడు గనుక జట్టుకు దూరమైతే పాకిస్తాన్‌కు తిప్పలు తప్పవు. అందుకే.. ఆయుబ్ ఫిట్‌నెస్‌పై స్పష్టత వచ్చిన తర్వాతే జట్టును ప్రకటించాలని పీసీబీ భావిస్తున్నట్లు బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించింది.
ఇక వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ కూడా ఈ మెగా ఈవెంట్‌కు క్వాలిఫై అయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్-‘ఎ’లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉండగా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఆడనున్నాయి. ఇక పాకిస్తాన్ తప్ప ఇప్పటికే మిగిలిన ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. అయితే, జట్లలో మార్పులకు ఫిబ్రవరి 11 వరకు సమయం ఉంది.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19న చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా మొదలుకానుండగా.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తమ మ్యాచ్‌లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనే ఆడనుంది.
చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు
Comments
Please login to add a commentAdd a comment