345 పరుగులు... వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టూ ఇంతటి భారీ లక్ష్యాన్ని అందుకోలేదు... శ్రీలంకతో మ్యాచ్‌లో 37 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన దశలో పాకిస్తాన్‌కు ఇది దాదాపు అసాధ్యం అనిపించింది. కానీ రిజ్వాన్, షఫీక్ కలిసి దానిని చేసి చూపించారు.
పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌లో గేర్లు మారుస్తూ చివరకు మరో 8 బంతులు మిగిలి ఉండగా పాక్‌కు విజయాన్నందించారు. అంతకుముందు మెరుపు బ్యాటింగ్‌తో కుశాల్ మెండిస్, సమరవిక్రమ చేసిన శతకాలు చివరకు జట్టుకు ఉపయోగపడలేదు. మొత్తం 689 పరుగుల ఈ పోరుతో హైదరాబాద్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ముగిశాయి.
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆడిన రెండు మ్యాచ్‌లనూ సంతృప్తిగా ముగించింది. మంగళవారం జరిగిన పోరులో పాక్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (77 బంతుల్లో 122; 14 ఫోర్లు, 6 సిక్స్‌లు), సదీర సమరవిక్రమ (89 బంతుల్లో 108; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగగా, పతుమ్ నిసాంక (61 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
మెండిస్ రెండో వికెట్‌కు నిసాంకతో 102 పరుగులు, మూడో వికెట్‌కు సమరవిక్రమతో 111 పరుగులు జోడించాడు. 65 బంతుల్లో సెంచరీ సాధించిన మెండిస్ శ్రీలంక తరఫున ప్రపంచకప్‌లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. అనంతరం పాకిస్తాన్ 48.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసి గెలిచింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిజ్వాన్ (121 బంతుల్లో 131 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్ (103 బంతుల్లో 113; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు బాది జట్టును గెలిపించారు. కండరాల నొప్పితో బాధపడుతూనే రిజ్వాన్ తన జట్టును విజయతీరానికి చేర్చాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 176 పరుగులు జత చేశారు. ఆరంభంలో శ్రీలంక చెలరేగినా... చివరి పది ఓవర్లలో 61 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) షఫీక్ (బి) షాదాబ్ 51; పెరీరా (సి) రిజ్వాన్ (బి) హసన్ 0; మెండిస్ (సి) ఇమామ్ (బి) హసన్ 122; సమరవిక్రమ (సి) రిజ్వాన్ (బి) హసన్ 108; అసలంక (సి) రిజ్వాన్ (బి) హసన్ 1; ధనంజయ (సి) షాహిన్ (బి) నవాజ్ 25; షనక (సి) బాబర్ (బి) షాహిన్ 12; వెలలాగె (సి) షఫీక్ (బి) రవూఫ్ 10; తీక్షణ (బి) రవూఫ్ 0; పతిరణ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 344. వికెట్ల
పతనం: 1–5, 2–107, 3–218, 4–229, 5–294, 6–324, 7–335, 8–343, 9–344. బౌలింగ్: షాహిన్ 9–0–66–1, హసన్ అలీ 10–0–71–4, నవాజ్ 9–0–62–1, రవూఫ్ 10–0–64–2, షాదాబ్ 8–0–55–1, ఇఫ్తికార్ 4–0–22–0.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) (సబ్) హేమంత (బి) పతిరణ 113; ఇమామ్ (సి) పెరీరా (బి) మదుషంక 12; బాబర్ ఆజమ్ (సి) సమరవిక్రమ (బి) మదుషంక 10; మొహమ్మద్ రిజ్వాన్ (నాటౌట్) 131; షకీల్ (సి) వెలలాగె (బి) తీక్షణ 31; ఇఫ్తికార్ అహ్మద్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (48.2 ఓవర్లలో 4 వికెట్లకు) 345. వికెట్ల పతనం: 1–16, 2–37, 3–213, 4–308.
బౌలింగ్: తీక్షణ 10–0–59–1, మదుషంక 9.2– 0–60–2, షనక 5–0–28–0, పతిరణ 9–0– 90–1, వెలలాగె 10–0–62–0, ధనంజయ డిసిల్వా 4–0– 36–0, అసలంక 1–0–10–0.
3 ఒక వన్డే మ్యాచ్‌లో నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి మాత్రమే కాగా, వరల్డ్ కప్‌లో మొదటిసారి. 1998లో లాహోర్‌లో ఇజాజ్ అహ్మద్, మొహమ్మద్ యూసుఫ్, పాంటింగ్, గిల్‌క్రిస్ట్...2013లో నాగపూర్‌లో కోహ్లి, ధావన్, బెయిలీ, వాట్సన్ సెంచరీలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment