
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ జాతీయ గీతానికి బదులు 'జిలేబీ బేబీ' పాట ప్లే చేశారు. ఇది ఓ రకమైన గందరగోళాన్ని సృష్టించింది.
టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారధి సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.
మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లు తమ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ నిరాకరించడాన్ని పాక్ క్రికెట్ బోర్డు చాలా సీరియస్‌గా తీసుకుంది.
ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లి భారత ఆటగాళ్లపై, మ్యాచ్ రిఫరి ఆండీ పైక్రాఫ్ట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, వారికి పైక్రాఫ్ట్ వంత పాడాడని ఆరోపిస్తుంది.
యూఏఈతో తదుపరి మ్యాచ్ సమయానికి (సెప్టెంబర్ 17) తమ డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఆ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ఐసీసీకి ధమ్కీ ఇచ్చింది. పీసీబీ బహిష్కరణ బెదిరింపుతో షేక్ హ్యాండ్ ఉదంతం తీవ్ర రూపం దాల్చినట్లైంది.
భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించడమే కాకుండా ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు కూడా పాల్పడిందని పీసీబీ గగ్గోలు పెడుతుంది. తాజాగా యూఏఈతో మ్యాచ్ రద్దు చేసుకుంటామని కొత్త పాట మొదలుపెట్టింది.
మొత్తంగా ఈ వివాదం ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోనని క్రీడాభిమానులు భయపడుతున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.