ఉదయం గం. 11 నుంచి ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
ముల్తాన్: పాకిస్తాన్ పర్యటనలో వెస్టిండీస్ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ముల్తాన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. స్పిన్ ట్రాక్‌పై కరీబియన్‌ను ఎదుర్కోనేందుకు ఆతిథ్య జట్టు కసరత్తు చేస్తోంది. ఇంగ్లండ్‌తో గత అక్టోబర్‌లో వాడిన స్పిన్ పిచ్‌నే ఈ మ్యాచ్‌కు సిద్ధం చేశారు. అప్పుడు సాజిద్ ఖాన్, నోమన్ అలీ తిప్పేశారు. ఈ తాజా సిరీస్‌లోనూ వాళ్లిద్దరిపై పాకిస్తాన్ గంపెడాశలు పెట్టుకుంది.
సొంతగడ్డ అనుకూలతలతో వెస్టిండీస్‌తో తలపడతామని పాక్ కెప్టెన్ షాన్ మసూద్ చెప్పాడు. స్వదేశంలో 2–1తో ఇంగ్లండ్‌ను ఓడించిన పాక్... దక్షిణాఫ్రికా పర్యటనలో 0–2తో ఓడిపోయింది. అయితే మరోవైపు వెస్టిండీస్ ఈ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రెండేళ్ల సైకిల్‌లో అసలు ఒక్క సిరీస్ కూడా గెలుపొందలేకపోయింది.
భారత్ సహా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల చేతిలో ఓడిన విండీస్... గట్టి ప్రత్యర్థి ఆస్ట్రేలియాను 1–1తో డ్రాతో నిలువరించింది. కానీ బంగ్లాదేశ్‌తో కూడా 1–1తో సిరీస్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో డబ్ల్యూటీసీలో కరీబియన్ జట్టు అట్టడుగున నిలిచింది.
అయితే గత ఫలితాలతో సంబంధం లేకుండా ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌ను విజయంతో ముగించేందుకే పాకిస్తాన్ పర్యటనకు వచ్చినట్లు వెస్టిండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ చెప్పాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ప్రధాన వేదికలైన కరాచీ, లాహోర్‌లలో నవీకరణ పనులు జరుగుతుండటంతో రెండో టెస్టు కూడా ముల్తాన్‌లోనే ఈ నెల 25 నుంచి జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment